మీకేమో 100 గదుల గడీలు.. పేదలకు డబుల్ బెడ్రూం కూడా ఇవ్వరా?: బండి సంజయ్

మీకేమో 100 గదుల గడీలు.. పేదలకు డబుల్ బెడ్రూం కూడా ఇవ్వరా?:  బండి సంజయ్
  • ఇచ్చిన హామీలడిగితే అరెస్టులేంది

న్యూఢిల్లీ, వెలుగు:  మీరు100 గదులతో గడీలు కట్టుకుని పేదలకు మాత్రం కనీసం డబుల్ బెడ్రూం కూడా ఎందుకు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్​ను బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘నేను, నా ముసల్ది ఇద్దరమే అని చెప్పినవ్. మరి కేవలం 8 నెలల్లో 100 గదులతో గడి లాంటి ప్రగతి భవన్​ను ఎందుకు కట్టుకున్నవ్. నువ్వేమో గడీలో దొరలాగా ఉంటే పేదలు మాత్రం గుడిసెల్లో బతుకాల్నా. 

ముఖ్యమంత్రి ఒక మోనార్క్’ అని సంజయ్ ఫైర్ అయ్యారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అక్రమ అరెస్ట్​ను ఖండిస్తున్నట్లు చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన హామీలనే బీజేపీ ప్రశ్నిస్తున్నదని తెలిపారు. ఇచ్చిన హామీలడిగితే అరెస్టులు, గృహనిర్బంధాలు ఏందని నిలదీశారు. 

ప్రభుత్వం నిర్మించామని చెబుతున్న ఇండ్లను చూసేందుకే బీజేపీ నేతలు వెళ్లారని.. కబ్జా, ధ్వంసం చేసేందుకో కాదని తెలిపారు. నిజంగా ఇండ్లు నిర్మించి ఉంటే బీజేపీ నేతలను చూసి ప్రభుత్వం ఎందుకు జంకుతున్నదని ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు పందులు, మందు బాటిళ్లు, సిగరెట్లు, గుట్కాలు, ఇతర కార్యకలాపాలకు నిలయంగా తయారయ్యాయని తెలిపారు. 

ముడితే గోడలు, కిటికీలు కూలిపోయే దశలో ఉన్నాయని సంజ య్ పేర్కొన్నారు. డబుల్ బెడ్రూవ ఇండ్లకు వచ్చిన దరఖాస్తులెన్ని, పంపిణీ చేసిన ఇండ్లు ఎన్ని, నిర్మాణంలో ఇంకెన్ని ఉన్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.