హైదరాబాద్, వెలుగు: మూసీ నది సుందరీకరణ పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చితే బీజేపీ ఊరుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. బఫర్ జోన్ చట్టాలను దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు చేకూర్చేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదని.. బుల్డోజర్ పాలనని ఫైర్ అయ్యారు. గురువారం ఆయన 'మూసీ గోస- బీజేపీ భరోసా యాత్ర'పేరిట హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్, బండ్లగూడ జాగీర్ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఇండ్లు కోల్పోయిన బాధితులు తమ గోడును రాంచందర్ రావుకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేద, మధ్యతరగతి ప్రజలను రోడ్డున పడేయడం దుర్మార్గమన్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌తో పాటు ఆ రెసిడెన్సీలో సుమారు 450 ఇండ్లకు, విఘ్నేశ్వర కాలనీలో 170 ఇండ్లుకు నోటీసులిచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
మాజీ సైనికులు, మధ్యతరగతి జీవుల ఇండ్లపై సర్కార్ కన్ను పడటం దారుణమన్నారు.రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మూసీని శుద్ధి చేయవచ్చని, ఎలాంటి నిర్మాణాలు కూల్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
