డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం నేటి నుంచి బీజేపీ ఆందోళనలు

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం నేటి నుంచి బీజేపీ ఆందోళనలు

అన్ని జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలపై ఇవాళ నుంచి ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది బీజేపీ. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చారు పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి. వచ్చేనెల నుంచి రేషన్ కార్డుల పంపిణీ ఆలస్యంపై ఆందోళనలకు రెడీ అయ్యారు. రైతు రుణమాఫీ, ధరణి రద్దుపై ఉద్యమాలు చేస్తామంటున్నారు నేతలు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములు సర్కార్ వెనక్కు తీసుకోవడంపై పెద్దఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించారు.  

బీజేపీ అనుబంధ మోర్చాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే అనుబంధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమావేశమయ్యారు. అనుబంధ కమిటీల మార్పు ఉండదని సంకేతాలిచ్చారు. 100 రోజుల ప్రణాళికపై వర్క్ ఔట్ చేయాలని బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు కిషన్ రెడ్డి. దీంతో కార్యాచరణపై దృష్టిపెట్టారు మోర్చాల నేతలు.

ఎన్నికల నిర్వాహణకు 22 కమిటీలు వేయాలని నిర్ణయించింది బీజేపీ. మ్యానిఫెస్టో, చార్జ్ షీట్, మీడియా ప్రచార కమిటీ, పబ్లిక్ మీటింగ్స్, టాకింక్ పాయింట్స్, ఫీడ్ బ్యాక్, స్టాటిస్టిక్స్, అదర్ స్టేటస్ కో ఆర్డినేటర్స్ కమిటీ సహా 22 కమిటీలు వేయాలని డిసైడైంది. ఇక వంద రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో సీరియస్ గా వర్క్ చేయాలని నిర్ణయించింది బీజేపీ.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు బీజేపీ నేతలు. అర్హులైన లబ్ధిదారులకు నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను పారదర్శకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా ప్రజా ప్రతినిధులు మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.