- బాన్సువాడలో బీజేపీ కార్యకర్తల అరెస్ట్‌ను ఖండిస్తున్నం: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, అలాంటి హక్కును అరెస్టుల ద్వారా అణచివేయడం విచారకరమని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ఒక రిలయన్స్ మార్ట్ దుకాణంలో దేవి దుర్గమ్మకు సంబంధించిన భక్తి గీతం ప్లే చేయడంపై, అక్కడే పనిచేస్తున్న ఒక వర్గానికి చెందిన ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఘర్షణ ప్రారంభమైంది.
ఆ తర్వాత, ఒక వర్గానికి చెందిన వారిపై మరో వర్గానికి చెందిన వారు రాళ్లు రువ్వినట్లు వచ్చిన నివేదికలు ఆందోళన కలిగించాయి. ఈ ఘటనకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం పోలీసులకు తగదు. హింసకు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలి.
మా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి”అని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు, కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చకు స్థానం ఉండాలి గానీ, హింసకు కాదన్నారు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అల్లర్లకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు.
గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం..
ఢిల్లీ ఏఐ సమిట్‌లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు శనివారం గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని, అరెస్ట్ చేశారు. ఏఐ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆఫీసుల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది.
