కేసీఆర్, కేటీఆర్ లపై ఆకుల శ్రీవాణి ఫిర్యాదు

కేసీఆర్, కేటీఆర్ లపై ఆకుల శ్రీవాణి ఫిర్యాదు

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‭లపై వెంటనే కేసులు నమోదు చేయాలని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. డీజే టిల్లు అని కేటీఆర్‭ను ఉద్దేశించి తాను అనలేదని చెప్పారు. కావాలనే తనపై కేసు నమోదు చేశారని ఆమె అన్నారు. బహిరంగంగా దేశ ప్రధాని, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్, కేటీఆర్ పై కేసు నమోదు చేయకపోతే... వారు మాట్లాడిన భాషపై ఎన్.వో.సి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీసీఎస్ సైబర్ క్రైమ్స్‭లో ఆకుల శ్రీవాణి పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ కార్పొరేటర్‭లతో కలిసి ఆమె పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం దేశ ప్రధాని, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సీఎం  కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ కార్పొరేటర్లు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‭లో ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్పొరేటర్ పై ఏ విధంగా అయితే హుటాహుటిన కేసు నమోదు చేశారో... అదే విధంగా కేసీఆర్, కేటీఆర్‭లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.