డబుల్ బెడ్రూం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు

డబుల్ బెడ్రూం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు

ఓట్ల కోసం తమ ఉనికి కాపాడుకుందనేందుకు టీఆర్ఎస్ సర్కార్ మరో సారి డబుల్ బెడ్రూం పథకం తెరపైకి తెచ్చిందని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ కమ్యూనిటీ హాల్, ఎస్ కె గార్డెన్ వద్ద లబ్ధిదారుల వివరాలు పరిశీలన చేస్తున్న కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న డబుల్ బెడ్రూం ఆశావహులను జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా పిలుచుకొని ఓటర్ ఐడీ కోసం పేద ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 

నిరుపేద ప్రజలు కొన్ని సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూంల కోసం మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అన్ని వివరాలు దరఖాస్తులో ఉన్న.. మళ్ళీ కేవలం ఓటర్ ఐడి నెంబర్లు రాసుకుంటున్నారని.. మరోసారి రానున్న ఎన్నికల స్టంట్స్ కోసమే కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికే డబుల్ బెడ్రూంల ఆశ చూపుతున్నారని అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 70వేల దరఖాస్తులకు గాను 1100 డబుల్ బెడ్రూంలు నిర్మాణం చేశారని అందులో 500 ఇప్పటికే ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇంతమంది ఆశావహులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. 

ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే.. ఎవ్వరిని ప్రలోభపెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని స్వార్ధ పనుల కోసం ఇలా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎవరి అనుమతి తీసుకొని ప్రజల వద్ద ఓటర్ ఐడీ నెంబర్లు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేస్తామని కొప్పుల నర్సింహా రెడ్డి హెచ్చరించారు.