ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు

ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
  • చేరికలపై పలు పార్టీ నేతలతో మంతనాలు
  • టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరుతామంటున్న లీడర్లు!
  • హైకమాండ్ చేతిలో మహబూబ్​నగర్, ఆదిలాబాద్ సీటు
  • మరికొన్ని స్థానాలకు అభ్యర్థులు కరువు
  • ఒకట్రెండు రోజుల్లో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ
  • సెకండ్ లిస్ట్​లో 4 నుంచి 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు : లోక్​సభ ఎన్నికల నోటిఫికేషన్​కు ముందే మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నది. ఇటీవల రిలీజ్ చేసిన 195 మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది మంది క్యాండిడేట్​లను ప్రకటించింది.మిగిలిన ఎనిమిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ)

పెద్దపల్లి (ఎస్సీ) స్థానాలకు బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నేతలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే బీఆర్ఎస్​కు చెందిన నాగర్​కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలను పార్టీలో చేర్చుకుని టికెట్లు కూడా అనౌన్స్ చేసింది. మిగిలిన స్థానాల్లో బలమైన అభ్యర్థులను దించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇతర పార్టీల నేతలతో రహస్యంగా మంతనాలు సాగిస్తున్నది. 

పెద్దపల్లి నుంచి మిట్టపల్లి పేరు

ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపినా.. టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరుతామంటూ వాళ్లు తేల్చి చెప్తున్నారు. దీంతో ఏం చేయాలో రాష్ట్ర నాయకత్వానికి అర్థం కాని పరిస్థితి ఉంది. పెద్దపల్లి వంటి ఎస్సీ నియోజకవర్గంలో కనీసం అభ్యర్థి దొరకడం కష్టంగా మారిందని పార్టీ నేతలే అంటున్నారు. మరోవైపు.. పార్టీలోని సీనియర్లంతా ఒకరి పేరు ప్రస్తావిస్తే.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేత మాత్రం..

తాను తీసుకొచ్చిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. పెద్దపల్లి నుంచి ఉద్యమ గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. నల్లగొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, వరంగల్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీళ్ల చేరిక తర్వాత అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

త్వరలో కోర్ గ్రూప్ కమిటీ భేటీ

అమిత్ షా నేతృత్వంలో జరిగిన తొలి కోర్ గ్రూప్ మీటింగ్​లో మొత్తం పది స్థానాలపై చర్చ జరగగా.. మహబూబ్​నగర్ మినహా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించారు. మిగిలిన ఏడు స్థానాలపై ఇప్పటి దాకా ఎలాంటి మీటింగ్ జరగలేదని పార్టీ కీలక నేతలు చెప్తున్నారు. వరంగల్, నల్లగొండ, మహబూబాబాద్, పెద్దపల్లిలో పార్టీలో చేరికలు, ఆదిలాబాద్, మెదక్ లో ఆశావహుల ఫైనల్ లిస్ట్ తర్వాత కోర్ గ్రూప్ మీటింగ్ జరగనుంది. ఒకట్రెండు రోజుల్లో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి ముందే సాధ్యమైనన్ని సీట్లను ఫైనల్ చేసే ఆస్కారం ఉంది. 

మిగిలిన స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు

1. మహబూబ్ నగర్: డీకే అరుణ, జితేందర్ రెడ్డి
2. పెద్దపల్లి : మిట్టపల్లి సురేందర్, సోగాల కుమార్
3. ఆదిలాబాద్: సోయం బాపురావు, నగేశ్, రమేశ్ రాథోడ్
4. వరంగల్: కృష్ణ ప్రసాద్, చింతా సాంబమూర్తి, శ్రీధర్
5. ఖమ్మం: పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండపల్లి శ్రీధర్, దేవకి వాసుదేవర రావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు (జీవీ), తాండ్ర వినోద్.
6. మహబూబాబాద్: సీతయ్య, హుస్సేన్ నాయక్
7. మెదక్: రఘునందన్ రావు, అంజిరెడ్డి, ఆలె భాస్కర్
8. నల్గొండ: సైదిరెడ్డి

తేలని మహబూబ్ నగర్, ఆదిలాబాద్ పంచాయితీ

ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరును ఫస్ట్ లిస్ట్​లో ప్రకటించలేదు. దీంతో ఆ స్థానంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆదిలాబాద్ లోక్​సభ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు వచ్చాయి. ఎంపీ స్థానాన్ని కూడా తిరిగి కైవసం చేసుకోవాలనే ఆలోచనలో పార్టీ ఉంది. ఈ సీటు కోసం మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేశ్ పై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు.

ఆయన్ను పార్టీలో చేర్చుకుని అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తున్నట్టు సమాచారం. మహబూబ్​నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ స్థానంపై తర్వాత చర్చిద్దామంటూ అమిత్ షా పక్కనపెట్టారు. ఇక మెదక్ నుంచి కొన్ని రోజులు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు వినిపించింది. తాజాగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి భర్త అంజిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.