- 116 మున్సిపాలిటీల్లో 2 చోట్లనే ఆధిక్యం
- 2,996 సీట్లకుగాను 335 గెలిచిన కమలం పార్టీ
హైదరాబాద్, వెలుగు: పట్టణాల్లో మంచి పట్టుందని చెప్పుకుంటున్న బీజేపీకి మున్సిపల్ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించిన కమలనాథులకు క్షేత్రస్థాయి ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. ఆ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో ఒక్క మున్సిపాలిటీనీ దక్కించుకోలేకపోయింది. కీలకమైన కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ పీఠాలు అడుగు దూరంలో ఆగిపోయాయి.
ఇండిపెండెంట్ల మద్దతుతో కరీంనగర్ మేయం పీఠం దక్కనున్నా, నిజామాబాద్‌లో లెక్కల చిక్కులు తేలడం లేదు. మరోవైపు 45 మున్సిపాలిటీల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 2,996 స్థానాలుంటే బీజేపీ కేవలం 335 స్థానాల్లో విజయం సాధించింది. సిట్టింగ్ మున్సిపాలిటీలు మక్తల్, అమన్ గల్ ను కోల్పోగా.. ఈ సారి ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీనీ ఔట్రైట్గా గెలుచుకోలేకపోయింది.
రెండకెల్లో మున్సిపల్/మేయర్ పీఠాలు.. నాలుగు అంకెల్లో వార్డు/డివిజన్ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ బరిలోకి దిగింది. కానీ, ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోవడంతో పార్టీ కేడర్‌లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్వయంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్ లో ప్రచారం చేసినా.. ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. కాగజ్ నగర్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించగా, అక్కడా మూడో స్థానమే దక్కింది.
ఇందూరులో.. మూడు అడుగుల దూరం
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 31 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) అవసరం. ఇక్కడ బీజేపీ 28 డివిజన్లలో గెలిచి సత్తా చాటింది. కానీ, మేయర్ కుర్చీకి ఇంకా మూడు సీట్ల దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 సీట్లు గెలుచుకోవడంతో.. అక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో బీజేపీకి ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లే దిక్కయ్యాయి.
ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఓటుతో పాటు.. ఇద్దరు ఎమ్మెల్సీల ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. కానీ, ఎంఐఎం, కాంగ్రెస్ కలిస్తే బీజేపీ ఆశలకు గండి పడే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక్కడ ఒకే స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ కీలకంగా మారింది.
కరీంనగర్ బీజేపీ ఖాతాలోనే..
కేంద్రమంత్రి బండి సంజయ్ ఇలాకా కరీంనగర్‌లోనూ బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. ఇక్కడ మొత్తం 66 డివిజన్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 34. బీజేపీ 30 సీట్లు గెలుచుకుని సత్తా చాటినా.. మేయర్ పీఠానికి ఇంకా 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇక్కడ 8 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. దీంతో వారి మద్దతు కూడగట్టేందుకు బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి చక్రం తిప్పుతున్నారు.
ఇప్పటికే ఓ ఇండిపెండెంట్, ఏఐఎఫ్బీ పార్టీ సభ్యుడు బీజేపీలో చేరారు. మిగిలిన వారిలోనూ కొందరు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ వాళ్లు చేరకపోయినా.. ఎక్స్ అఫీషియో సభ్యులతో మేయర్ పీఠం కైవసం చేసుకోనున్నారు.
మరో 5 చోట్ల త్రిశంకు స్వర్గమే..
బీజేపీ ఆశలు పెట్టుకున్న మరో 5 మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్, నారాయణపేట, మెట్‌పల్లి, రాయికల్ లలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీగా నిలిచింది. కానీ, ఏ ఒక్కచోటా సొంతంగా చైర్మన్ పదవి దక్కించుకునేంత మెజారిటీ రాలేదు. ఆదిలాబాద్ లో 49 వార్డులకు గాను బీజేపీ 21 గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ 25కు ఇంకా 4 సీట్లు కావాల్సి ఉంది.
నారాయణపేటలో 24 వార్డులకు గాను 11 గెలిచింది. మ్యాజిక్ ఫిగర్13కు 2 సీట్లు తక్కువయ్యాయి. రాయికల్ లో 12 సీట్లకు గాను 5 బీజేపీ గెలిచింది. ఇలా పలు చోట్ల చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. భైంసాలో ఆరు సీట్లు వచ్చినా ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా ఉన్నారు. వారి సహాయంతో చైర్మన్ పదవి దక్కించుకునే అవకాశాలను ఆ పార్టీ పరిశీలిస్తోంది.
45 స్థానాల్లో ఖాతా తెర్వలే..
2020లో జరిగిన ఎన్నికల్లో 120 మున్సిపాలిటీల్లో 237 వార్డుల్లో.. 10 కార్పొరేషన్లలో 78 డివిజన్లలో బీజేపీ గెలిచింది. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. వాటిలో 78 చోట్ల బీజేపీ తన ఖాతాను తెరిచింది. మరో 45 చోట్ల ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయింది. ఉత్తర తెలంగాణలో సత్తా చాటిన ఆ పార్టీ.. దక్షిణ తెలంగాణ, ఖమ్మం జిల్లాల్లో చతికిలపడింది.
ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో (ఏదులాపురం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, వైరా) ఒక్క వార్డు కూడా గెలవలేదు. ఇక సూర్యాపేట జిల్లాలో ఆ మున్సిపాలిటీలో ఒక సీటు మినహా.. హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఖాతా ఓపెన్ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మున్సిపాలిటీలోనూ బీజేపీ ఖాతా తెరవలేదు.
