- రాంచందర్ రావును బరిలోకి దించే యోచనలో హైకమాండ్
- నల్గొండ సీటుపై అంతంతే పోటీ.. రెండు స్థానాలకు ఇన్‌చార్జిల నియామకం
- మొదలైన ఓటరు నమోదు.. నాలుగైదు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేయడంతో కమలంలోనూ టికెట్ల సందడి మొదలైంది. ఉమ్మడి హైదరాబాద్–-రంగారెడ్డి-–మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లో పోటీకి ఆశావహులు క్యూ కడుతుండగా.. నల్గొండ–-వరంగల్-–ఖమ్మం స్థానంలో పోటీ తక్కువగా ఉంది.
గతంలో కరీంనగర్ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న జోరును ఈ ఎన్నికల్లోనూ కొనసాగించాలని బీజేపీ భావిస్తున్నది. ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్, క్షేత్రస్థాయి సమన్వయం కోసం హైదరాబాద్ స్థానానికి ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యను, నల్గొండ స్థానానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డిని ఇన్‌చార్జిలుగా నియమించింది. రెండు స్థానాల కోఆర్డినేషన్ బాధ్యతలను ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి అప్పగించింది.
హైదరాబాద్‌పైనే భారీ ఆశలు..
ఉమ్మడి హైదరాబాద్-–రంగారెడ్డి–-మహబూబ్‌నగర్ స్థానంపై బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ సెగ్మెంట్ పరిధిలోని ఐదు పార్లమెంట్ స్థానాల్లో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్ స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో ఇక్కడ విజయంపై ధీమాతో ఉంది. గతంలో ఈ స్థానం నుంచి గెలిచిన ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును మరోసారి పోటీ చేయించాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన పోటీకి సుముఖంగా లేరని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన వద్దనుకుంటే ఇతరులకు చాన్స్ దక్కనుంది. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తన ముఖ్య అనుచరుడు డోకూరి పవన్ కుమార్‌కు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్, పార్టీ ఆల్ సెల్స్ కోఆర్డినేటర్ సారంగుల అమర్‌నాథ్, ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ వెంకట్ రెడ్డితో పాటు మరో ముగ్గురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఈ స్థానం కోసం ఏకంగా 28 మంది అప్లై చేసుకున్నట్లు తెలిసింది.
నల్గొండలో పోటీ తక్కువే..
నల్గొండ–-వరంగల్–-ఖమ్మం స్థానంలో సంస్థాగత బలం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ ఇమేజ్, కేంద్ర సంక్షేమ పథకాలతో గెలవాలని బీజేపీ భావిస్తున్నది. ఇక్కడి నుంచి కాసం వెంకటేశ్వర్లు, పుల్లారావు యాదవ్‌తో పాటు ఓ విద్యావేత్త, మరో పారిశ్రామికవేత్త టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ భిక్షంగౌడ్, ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది.
మొదలైన ఓటరు నమోదు..
రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అవగాహన కోసం బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించి, జిల్లాలకు దరఖాస్తు ఫారాలు పంపించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా విభజించి, బూత్ స్థాయి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించే బాధ్యతలను నేతలకు అప్పగించింది. టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా సొంత నెట్‌వర్క్‌తో ఎన్‌రోల్‌మెంట్ చేయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తున్నది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులు, ప్రాజెక్టులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పట్టభద్రుల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసింది.
నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తం: రాంచందర్ రావు
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. తాను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయమని, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. అభ్యర్థుల వివరాలను ఇప్పటికే జాతీయ నాయకత్వానికి పంపించామని వెల్లడించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
