హైదరాబాద్, వెలుగు : బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమై 14 దాకా కొనసాగుతాయని, ఇందులో భాగంగా ‘‘పల్లె పల్లెకు ఓబీసీ.. ఇంటింటికి బీజేపీ”అనే నినాదంతో ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని పార్టీ ఓబీసీ నేతలు వెల్లడించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, బీజేపీ స్టేట్ ట్రెజరర్ శాంతికుమార్లు మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా నుంచి బండి సంజయ్ ఈ ప్రోగ్రామ్ప్రారంభిస్తారన్నారు.
ఈ సందర్భంగా ‘‘పల్లె పల్లెకు ఓబీసీ.. ఇంటింటికి బీజేపీ” పాంప్లెంట్స్, వాల్పోస్టర్లను వారు ఆవిష్కరించారు. రాష్ట్రంలో బీసీలను కేసీఆర్ ఎలా ఇబ్బంది పెడుతున్నాడో 10 లక్షల పాంప్లెంట్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు. దేశంలో 50 నుంచి 60 శాతం వరకు బీసీ జనాభా ఉందని తెలిపారు. రాష్ట్రంలో లక్ష కుటుంబాలుంటే అందులో 52 నుంచి- 55వేల కుటుంబాలు బీసీలవే అని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్లీ గడీల పాలన మొదలైందని ఆరోపించారు.
బీసీలను ఆదుకున్నది బీజేపీయే..
రాహుల్, కేసీఆర్ దేశానికి రాహు.. కేతువుల్లా తయారయ్యారని నేతలు విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని అంబేద్కర్ కోరితే.. నెహ్రూ వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాహుల్ కూడా ఇప్పుడు బీసీ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
