OTT Ads: డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ కొనుక్కున్నా యాడ్స్ గోల తప్పట్లే.. ఓటీటీల తీరుపై మండిపడుతున్న ఆడియన్స్

OTT Ads: డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ కొనుక్కున్నా యాడ్స్ గోల తప్పట్లే.. ఓటీటీల తీరుపై మండిపడుతున్న ఆడియన్స్

ఈ బిజీ ప్రపంచంలో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైతే థియేటర్లకు పోటెత్తే ప్రేక్షకులు.. ఇప్పుడు భారీ చిత్రాలు వస్తే తప్ప థియేటర్ వైపు చూడటం లేదు. ముఖ్యంగా కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం పెరగడంతో వినోద ప్రపంచం పూర్తిగా డిజిటల్ వైపు మళ్లిపోయింది. అలా ప్రస్తుతం ప్రేక్షకులకు ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్స్ట్, జీ5 వంటి ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ కంటెంట్ వరకు అన్నింటినీ ఇంటి వద్దకే అందిస్తూ.. ప్రేక్షకులను తమవైపు ఆకర్షిస్తున్నాయి.

అయితే, ఇదే అదనుగా కొన్ని ఓటీటీ సంస్థలు అధిక లాభాల కోసం మితిమీరిన యాడ్స్ చూపిస్తూ సబ్‌స్క్రైబర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. టీవీలో కంటే ఘోరంగా ఓటీటీల్లో యాడ్స్ వేస్తూ చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో ఓటీటీల తీరుపై ఆడియన్స్ మండిపడుతున్నారు. 

యాడ్స్ తగ్గిస్తాయా? సబ్‌స్క్రైబర్లను వదులుకుంటాయా?

ఓటీటీలు తీసుకొచ్చే కొత్త కంటెంట్కి అలవాటుపడిన ఆడియన్స్, వేలకు వేలు డబ్బులు పెట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. కానీ, ఇదే సమయంలో నిమిషాల కొద్ది నిడివితో.. సినిమా ట్రైలర్ మాదిరిలా యాడ్స్ వేస్తూ విసిగిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో నచ్చిన సినిమా చూడటానికి ఉన్న ఉత్సాహమంతా.. యాడ్స్ రూపంలో ఆవిరైపోతుంది. దీంతో ‘డబ్బులు పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ని యాడ్స్ ఎందుకు?’ అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : మహేష్ బాబు 'వారణిసి'కి బడ్జెట్ కష్టాలు

కొందరైతే సినిమా మధ్యలోనే ఆపేసి, తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా బయటపెడుతున్నారు. యాడ్స్ సమస్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థలు సబ్‌స్క్రైబర్ల కంప్లైంట్స్ ని పరిగణనలోకి తీసుకుని యాడ్స్ సంఖ్యను తగ్గిస్తాయా? లేక మరింత ఆదాయం కోసం యాడ్స్‌ను పెంచుతూ తమ సబ్‌స్క్రైబర్లను వదలుకుంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది.