అమెరికాలో బుల్లెట్ రైళ్లు ఎందుకు లేవు ? టెక్నాలజీలో తోపైనా.. ఆ విషయంలో ఎందుకు వెనకబడిందంటే ?

అమెరికాలో బుల్లెట్ రైళ్లు ఎందుకు లేవు ? టెక్నాలజీలో తోపైనా.. ఆ విషయంలో ఎందుకు వెనకబడిందంటే ?

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక సాంకేతికత, తిరుగులేని రక్షణ వ్యవస్థ.. ఇలా ప్రతి రంగంలోనూ నంబర్ వన్ స్థానంలో ఉన్న దేశం అమెరికా. కానీ, ఒక విషయంలో మాత్రం అమెరికా ఇంకా వెనుకబడిపోయింది. అదే ‘హై-స్పీడ్ బుల్లెట్ రైళ్లు’. చైనా, జపాన్, యూరప్ దేశాలు బుల్లెట్ రైళ్లతో దూసుకుపోతుంటే, అమెరికాలో మాత్రం ఇప్పటివరకు ఒక్క  బుల్లెట్ రైలు మార్గం కూడా అందుబాటులోకి రాలేదు. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో చూద్దామా.....

*అమెరికాలో 71 అంతర్రాష్ట్ర హైవేలు, 5 వేలకు పైగా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అమెరికన్ల లైఫ్ స్టయిల్  పూర్తిగా కార్లు, విమానాల చుట్టూనే తిరుగుతుంది. ఈ ‘కార్ కల్చర్’ వల్లే వారు బుల్లెట్ రైలు కాన్సెప్ట్‌ను పెద్దగా పట్టించుకోలేదు.

*అమెరికా వెనుకబడితే.. చైనా మాత్రం ఈ రంగంలో చరిత్ర సృష్టిస్తోంది. అక్కడ ఇప్పటికే 50 వేల కిలోమీటర్లకు పైగా హై-స్పీడ్ రైలు మార్గాలు ఉన్నాయి. 2030 నాటికి ఇది 60 వేల కిలోమీటర్లకు చేరనుంది. అంతేకాదు, బుల్లెట్ రైళ్లు వచ్చిన చైనా నగరాల్లో 14.2 శాతం ఆర్థిక వృద్ధి నమోదైంది.

*యూరోపియన్ యూనియన్ మొత్తం మీద 8,500 కిలోమీటర్ల హై-స్పీడ్ ట్రాక్స్ ఉంటే, కేవలం స్పెయిన్ ఒక్క దేశంలోనే 3,190 కిలోమీటర్ల నెట్‌వర్క్ ఉంది.

*అమెరికాలో రైలు మార్గాల నిర్మాణానికి స్థానికుల నుంచి వ్యతిరేకత, రాజకీయ నాయకుల్లో ఆసక్తి లేకపోవడం, నిధుల కొరత వంటివి బుల్లెట్ రైలు కలను అడ్డుకున్నాయి. గతంలో ట్రంప్ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల నిధులను నిలిపివేయడం కూడా దీనికి కారణం.

*ప్రస్తుతం అమెరికాలో రెండు పెద్ద ప్రాజెక్టులు నడుస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో – లాస్ ఏంజిల్స్ (840 కిమీ) మార్గం 2033 నాటికి, అలాగే లాస్ ఏంజిల్స్ – లాస్ వెగాస్ మధ్య ప్రైవేట్ నిధులతో నడుస్తున్న ‘బ్రైట్ లైన్ వెస్ట్’ ప్రాజెక్ట్ 2028 నాటికి పూర్తి కానున్నాయి.

సాంకేతికంగా ఎంతో ముందున్నా అమెరికా బుల్లెట్ రైళ్ల విషయంలో వెనుకబడటం ఆశ్చర్యకరమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులు విజయవంతమైతే, అమెరికా రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.