
- సమిష్టిగా కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు
- వరంగల్, పెద్దపల్లి నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పుకోవడానికి బీజేపీ వద్ద ఎజెండానే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందుకే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా అసలైన సమస్యలు చర్చకు రాకుండా, ప్రజల దృష్టిని మరల్చే ఇలాంటి కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పి కొట్టాలని బీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నదాతల నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల దాకా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు. నాయకుల వలసల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని, తెలంగాణ సమాజం బీఆర్ఎస్‌తోనే ఉన్నదని చెప్పారు. వరంగల్ నుంచి బీఆర్ఎస్ బరిలోకి దించిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు.పెద్దపల్లిలో కూడా గులాబీ గెలుపు ఖాయం అయిపోయిందని అన్నారు.