కేటీఆర్‌ని కలిసిన వారిపై బీజేపీ ఎంక్వైరీ

కేటీఆర్‌ని కలిసిన వారిపై బీజేపీ ఎంక్వైరీ
  • లింగోజిగూడ ఇష్యూపై.. బీజేపీ త్రీ మెన్ కమిటీ ఎంక్వైరీ
  • విచారణకు హాజరైన నేతలు.. నేడు కమిటీ ముందుకు మరికొందరు
  • ఇయ్యాల సాయంత్రానికి పార్టీకి రిపోర్టు

హైదరాబాద్, వెలుగు: ‘లింగోజిగూడ’ ఘటనపై బీజేపీ త్రీ మెన్ కమిటీ విచారణ కొనసాగుతోంది. ఈ డివిజన్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం అంటూ ఇటీవల కొందరు బీజేపీ నేతలు ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్ ను కలవడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. దీంతో పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించేందుకు, నిజాలు నిగ్గు తేల్చేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోమవారం ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. కేటీఆర్ ను కలిసిన బీజేపీ నాయకుల్లో ఏడుగురు మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీసులో త్రీ మెన్ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు.

లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే కేటీఆర్ ను కలిశామని, ఇది ఇంత రాద్ధాంతానికి దారితీస్తుందని ఊహించలేకపోయామని వారు కమిటీ ముందు చెప్పినట్లు తెలిసింది. ప్రగతి భవన్ కు వెళ్తున్న విషయం కారులో కూర్చునే వరకు తెలియదని, కేటీఆర్​ను కలవడం తప్పేనని వారు కమిటీ ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. బుధవారం మరో నలుగురు నేతలు కమిటీ ముందు హాజరుకానున్నారు. వీరిలో బీజేపీ మాజీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ పేరాల శేఖర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఉన్నారు. వీరి వివరణ అనంతరం బుధవారం సాయంత్రం త్రీ మెన్ కమిటీ రాష్ట్ర పార్టీకి రిపోర్టు ఇవ్వనుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడి పరిధిలో ఉన్న వారిపై బండి సంజయ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని, కొందరు సీనియర్ నేతల విషయంలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో చర్చించి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

నిజాలు తెలుసుకునేందుకే కమిటీ:  సంజయ్
లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం బీజేపీ నేతలు కొందరు కేటీఆర్ ను కలవడానికి దారి తీసిన పరిస్థితులపై వాస్తవాలను తెలుసుకునేందుకు పార్టీ కమిటీని ఏర్పాటు చేసిందని బండి సంజయ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో బీజేపీ మరోసారి విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పోటీ చేయడానికి మేము సిద్ధమైతే, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుకు గాని సమాచారం ఇవ్వకుండా కొందరు నేతలు కేటీఆర్ ను కలవడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఇది పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. అందుకే ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కోసం త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు.