కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అంటే బీజేపీకి భయం పట్టుకుంది

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అంటే బీజేపీకి భయం పట్టుకుంది

అందుకే ఆయనను రాష్ట్రానికే పరిమితం చేయాలని చూస్తున్నరు:మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డి
 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేశానికి సీఎం కేసీఆర్‌‌‌‌ వేగుచుక్కలా కనిపిస్తున్నారని మంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మాదిరిగా దేశమంతా ఉచిత కరెంట్‌‌‌‌, రైతుబంధు, రైతు బీమా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్‌‌‌‌ రూపంలో దేశంలో ప్రత్యామ్నాయం కనిపిస్తోందని, ఆయన క్రేజ్‌‌‌‌ అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోందని పేర్కొన్నారు. గుజరాత్‌‌‌‌లోనూ కేసీఆర్‌‌‌‌ పేరు వినిపిస్తుండటంతో బీజేపీ తట్టుకోలేకపోతోందన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో నిర్వహించిన మీట్‌‌‌‌ ది ప్రెస్‌‌‌‌లో మంత్రి మాట్లాడారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్‌‌‌‌ తగ్గిపోతోందని, అందుకే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ, ప్రాంతీయ పార్టీలను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని గుర్తించి, ఆయనను తెలంగాణకు పరిమితం చేసేందుకే మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని ఆరోపించారు. దేశభద్రత అంశంపైనే 2024లో ఎన్నికలకు వెళ్తారన్నారు. కాంగ్రెస్‌‌‌‌ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. మునుగోడులో మంత్రులు, ఎమ్మెల్యేల మోహరింపుపై స్పందిస్తూ, తమకు మునుగోడు కొత్తది కాదని, అక్కడికి కొత్తగా వచ్చింది అమిత్‌‌‌‌ షా, నడ్డా, ఇతర బీజేపీ నేతలన్నారు. 

వచ్చే ఎన్నికల్లో మునుగోడు ప్రభావం ఉంటది..

నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌‌‌‌ ఆరేండ్లలోనే ఫ్లోరోసిస్‌‌‌‌ను నిర్మూలించారని, 2014 వరకు రాష్ట్రాన్ని ఏలిన పాలకులకు ఈ సోయి లేకుండా పోయిందని జగదీశ్‌‌‌‌ రెడ్డి అన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులు మునుగోడులో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు మద్దతునిస్తున్నారని, భవిష్యత్‌‌‌‌లోనూ వారితో కలిసి ప్రయాణిస్తామని తెలిపారు. బీజేపీకి నియోజకవర్గంలో లీడర్లు, క్యాడర్‌‌‌‌ లేకపోవడంతోనే డబ్బులు, మందును పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.

సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుందన్నారు. రాజగోపాల్‌‌‌‌ రెడ్డి బలమైన అభ్యర్థి కాదని, బద్నాం అయిన బలహీన అభ్యర్థి అన్నారు. రాహుల్‌‌‌‌ జోడో యాత్రకు పెద్దగా స్పందన రావడం లేదని, పార్టీనే జోడించలేనోడు.. దేశాన్ని ఏం ఐక్యం చేస్తారని విమర్శించారు.