బీవైడీ ప్రాజెక్టు రావట్లేదా.. చైనా కంపెనీలు వద్దంటున్న కేంద్రం

బీవైడీ ప్రాజెక్టు రావట్లేదా.. చైనా కంపెనీలు వద్దంటున్న కేంద్రం
  • హోం, ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌ మినిస్ట్రీల అభ్యంతరాలు
  • భద్రతకు ముప్పేనంటున్న అధికారులు

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రిక్​ వెహికల్​ తయారీ కంపెనీ బీవైడీ మన దేశంలో పెట్టాలనుకుంటున్న జాయింట్​ వెంచర్ పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదని తెలుస్తోంది. హైదరాబాద్ ​ కేంద్రంగా  పనిచేస్తున్న ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ గ్రూప్​ మేఘ ఇంజినీరింగ్​ అండ్​ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్​తో కలిసి ఈవీలు, వాటి బ్యాటరీల తయారీకి తెలంగాణ రాష్ట్రంలో ఫెసిలిటీ పెడతామని బీవైడీ  కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన విషయం తెలిసిందే. అయితే, దేశ భద్రత దృష్ట్యా బీవైడీ ఎంట్రీని ఆపాలని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీపై ఇండియా కంపెనీలకు కంట్రోల్​ ఉండదని, దాంతో జాయింట్​ వెంచర్​లో అవి డమ్మీలుగా మాత్రమే ఉంటాయని ప్రభుత్వం భయపడుతోందని టైమ్స్​ ఆఫ్​ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. దాదాపు 8 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్​ వెహికల్స్​తో పాటు, బ్యాటరీల తయారీకి ప్లాంట్‌‌‌‌‌‌‌‌  ఏర్పాటు చేయాలనే ఆకాంక్షను బీవైడీ వ్యక్తం చేసింది. చైనా కంపెనీలు దేశంలోకి రావడం పట్ల హోం, ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌ మినీస్ట్రీలు ..రెండూ అసౌకర్యంగా ఉన్నట్లు ఆ రిపోర్టు పేర్కొంది. 

జేవీలలో మన కంపెనీలు డమ్మీలే.....

చైనా కంపెనీలు మన దేశంలో ఏర్పాటు చేస్తున్న చాలా జాయింట్​ వెంచర్​ కంపెనీలలో కొన్ని ప్రభుత్వపరమైన సపోర్ట్​ కూడా తీసుకున్నాయి. కానీ, ఈ జాయింట్​ వెంచర్​ కంపెనీల  నిర్వహణ మొత్తం విదేశీ కంపెనీల చేతిలోనే ఉంటోంది. ఇండియా కంపెనీ పాత్ర నామమాత్రమవుతోందని, టెక్నాలజీ పరంగా అసలు కంట్రోలే మన కంపెనీలకు ఉండటం లేదని టైమ్స్​ ఆఫ్​ ఇండియా రిపోర్టు వెల్లడించింది. బీవైడీ ప్రపోజల్​ విషయంలో ప్రభుత్వానికి ఇలాంటి అభ్యంతరాలే ఉన్నాయని, ఇండియాలో దూసుకెళ్లాలనుకుంటున్న చైనా ఎలక్ట్రిక్​ కంపెనీ ఎంట్రీపై అందుకే ఓకే చెప్పడానికి ఇబ్బందిపడుతోందని రిపోర్టు వివరించింది.

టెస్లాకు పోటీ ఇవ్వడమే బీవైడీ టార్గెట్​...

తన బ్రాండ్​ ఎలక్ట్రిక్​ వెహికల్స్ అన్నింటినీ ఇండియాలో తయారు చేయాలనే ఆలోచనతోనే మేఘ ఇంజినీరింగ్​ గ్రూప్​తో బీవైడీ చేతులు కలుపుతోందని రాయిటర్స్​ ఇంతకు ముందు ఒక రిపోర్టు ప్రచురించింది. టెస్లాకు ధీటైన పోటీగా ఇండియా మార్కెట్లో నిలవాలనేది  చైనా కంపెనీ బీవైడీ ఆలోచనగా పేర్కొంది. ఒకవేళ ఇండియాలో అనుమతి దొరికితే ఒక్క అమెరికా తప్ప అన్ని పెద్ద గ్లోబల్​ మార్కెట్లలోనూ బీవైడీ ఎంటరయినట్లు అని రాయిటర్స్​రిపోర్టు తెలిపింది.

ఎఫ్​డీఐ రూల్స్​ మార్చిన ప్రభుత్వం...

మన దేశంలో పెట్టుబడులు పెట్టే చైనా కంపెనీలను కట్టడి చేసే ఉద్దేశంతో ఇంతకు ముందే ప్రభుత్వం రూల్స్​ను మార్చింది. ముఖ్యంగా ఫారిన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్స్​ నిబంధనలలో చాలా మార్పులు తెచ్చారు. మన దేశంలో కార్లు అమ్ముతున్న ఎంజీ మోటార్స్​, గ్రేట్​వాల్​ మోటార్స్​ వంటి ఆటోమొబైల్ కంపెనీల ప్లాన్స్​కు రూల్స్​ మార్పు ద్వారా అడ్డుకట్ట వేశారు. కొత్త పెట్టుబడులు రాక ఎంజీ మోటార్స్​ ఇటీవలి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాంతో, ఇండియాలోనే పార్ట్​నర్స్​ను వెతుక్కునే పనిలో పడింది. ఇండియన్​ పార్ట్​నర్స్​కు మెజారిటీ వాటా ఇవ్వడానికి సైతం ఈ కంపెనీ ఇప్పుడు ఆసక్తి కనబరుస్తోంది.