కిసాన్ జవాన్ సమ్మాన్ దివస్‌గా మోడీ పుట్టిన రోజు

కిసాన్ జవాన్ సమ్మాన్ దివస్‌గా మోడీ పుట్టిన రోజు

ప్రధాని నరేంద్ర మోడీ 71వ జన్మదినాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. మోడీ జన్మదినమైన ఈ నెల 17న.. ఆయన 20 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనంగా సేవా, సమర్పణ్  అభియాన్  పేరిట దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధాని సేవలను అభినందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ బూత్‌ల నుంచి ఆయనకు ఐదు కోట్ల పోస్టుకార్డులు పంపనున్నట్లు తెలిపింది. కొవిడ్  నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు సూచించారు. వాటి పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా, పురంధేశ్వరి, వినోద్ సోన్‌కర్ , రాష్ట్రీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్‌‌కు అప్పగించారు. ఈ వేడుకల్లో భాగంగా మోడీ జీవిత చరిత్రపై ప్రత్యేక ఎగ్జిబిషన్లు, నమో యాప్‌లోలో వర్చువల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 71 చోట్ల గంగా నది ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆరోగ్య, రక్తదాన శిబిరాలు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నిత్యవసరాల పంపిణీ, అక్టోబరు 2న పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోడీకి అందిన బహుమతులను వేలంవేయనున్నారు.

రైతులు, సైనికులకు సన్మానం

దేశంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రధాని మోడీ పుట్టిన రోజును ‘కిసాన్‌ జవాన్ సమ్మాన్ దివస్‌’గా నిర్వహించాలని బీజేపీ కిసాన్‌ మోర్చా నిర్ణయించింది. స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్న రైతులను ఆ రోజున (సెప్టెంబర్ 17న) సన్మానిస్తామని కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌‌ చాహర్ తెలిపారు.  అలాగే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబ సభ్యులను, సరిహద్దుల్లో ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న వీర జవాన్లను, రిటైర్ అయిన మాజీ సైనికులను సత్కరించాలని నిర్ణయించామని చెప్పారు. మోడీ పుట్టిన రోజు నాడు మన దేశ భద్రత, ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న జవాన్లు, రైతులను సన్మానించడంతో పాటు వారికి లెటర్‌‌ ఆఫ్​ హానర్ కూడా అందిస్తామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన పథకాలపై అన్ని జిల్లాల్లో కిసాన్‌ మోర్చా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్, కిసాన్‌ క్రెడిట్ కార్డ్ లోన్ స్కీమ్, నీమ్‌ కోటెడ్ యూరియా లాంటి పథకాల గురించి కిసాన్ మోర్చా సభ్యులు రైతులకు వివరిస్తారని రాజ్‌ కుమార్‌‌ తెలిపారు.