గాంధీభవన్ లో ముగ్గురికి ఢిల్లీ పోలీసుల సమన్లు

గాంధీభవన్ లో ముగ్గురికి  ఢిల్లీ పోలీసుల సమన్లు

 

  • సీఆర్పీసీ 91 కింద జారీ
  • మే1న విచారణకు రావాలని ఆదేశం
  • కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జి సతీశ్ కు కూడా..
  •  అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో...


కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో గాంధీభవన్ కు చెందిన ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గాంధీ భవన్ నుంచే సోషల్ మీడియాలో వీడియోల షేరింగ్ జరిగిందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 91కింద కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జి మన్నె సతీష్, శివకుమార్,అస్మా తస్లిమ్ లకు నోటీసులు జారీ చేశారు. అమిత్‌ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.

 అక్కడ మాట్లాడుతూ ‘‘భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది ఫేక్ వీడియో అని బీజేపీ, కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడంతో IPC సెక్షన్ 153, 153ఏ, 465, 469, 171జీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియోను అప్‌లోడ్ చేసిన, షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ పోలీసులు X(ట్విటర్), ఫేస్ బుక్ కు కూడా నోటీసులు కూడా పంపారు. దీంతో రంగ ప్రవేశం చేసిన ఢిల్లీ పోలీసులు ఇవాళ పోలీసు అధికారి వచ్చి గాంధీ భవన్ లో నోటీసులు అందించి వెళ్లారు. వచ్చే సమయంలో మొబైల్ ఫోన్ కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.