V6 News

కేసీఆర్ ప్రతి స్కీమ్ వెనుక ఓ స్కామ్ : లక్ష్మణ్

కేసీఆర్ ప్రతి స్కీమ్ వెనుక ఓ స్కామ్ : లక్ష్మణ్

రాష్ట్రంలో అవినీతి రోజురోజుకు పెరిగిపోతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ లో మాట్లాడిన లక్ష్మణ్.. రాష్ట్రంలో అవినీతిలేని విభాగమే లేకుండా పోతోందని అన్నారు. ప్రతి స్కీం వెనుక స్కామ్ ఉందనీ…  బీజేపీ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తుకు ముందుకు రావడం లేదన్నారు.

ఈఎస్ఐలో రూ. 300 కోట్ల స్కామ్ జరిగిందన్నారు లక్ష్మణ్. అక్రమ సంపాదనతో రాజకీయాలు చేయడం, ఎన్నికల్లో గెలవడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. పచ్చదనం పేరుతో రూ.వేలకోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలపై సీఎం నుంచి ఎటువంటి స్పందన రాలేదనీ.. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలలో పదిశాతం కూడా కనిపించడం లేదన్నారు. గొర్రెల పంపిణీలో 90 శాతం అక్రమాలు జరిగాయన్నారు లక్ష్మణ్. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై రాష్ట్రపతి నివేదిక కోరిన ఇంతవరకు స్పందించలేదన్నారు.

నీలోఫర్ లో పసిపిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేయడం దారుణం అన్నారు లక్ష్మణ్. ఆరోగ్య మంత్రికి తెలియకుండానే ఇవి జరుగుతాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర పోషిస్తోందనీ.. ఉత్తమ్, కేటిఆర్ పొద్దున తిట్టుకుంటూ సాయంత్రం సమాలోచన పెట్టుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్,కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకుంటున్న సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు భూమన్నను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తప్పుపడుతోందన్నారు లక్ష్మణ్. సర్పంచ్ భూమన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.