
- స్టేట్‌లో కనుమరుగయ్యే దశలో బీఆర్ఎస్: ఏలేటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాడీగార్డ్‌లా మారారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేసుల మాఫీ, అరెస్టులను ఆపడం కోసం మద్రాసు ఒప్పందం మేరకు కేటీఆర్ సుపారీ తీసుకొని.. బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే దశలో ఉన్నదని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
రేవంత్ రెడ్డి ఐదేండ్లు సీఎంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎన్నడూ లేని ప్రేమ చూపిస్తున్నదని అన్నారు. చెన్నైలో డీకే శివకుమార్ తో కేటీఆర్ భేటీ అయ్యారని, మద్రాసులో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, ఈ కారు రేస్, ధరణిపై కేసులు ముందుకు వెళ్లకపోవడానికి కారణం మద్రాసు ఒప్పందమేనని ఆరోపించారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరికొకరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్నారు.
హెచ్ సీయూ భూములపై లోన్ తీసుకున్నది, భూములు అమ్మాలని ప్రయత్నించింది కాంగ్రెస్ ప్రభుత్వమని, కానీ వారు బీజేపీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఏలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను బీజేపీ ఎంపీ పేరు చెప్పకుండా అడ్డుకున్నది ఎవరని, ఎందుకు పేరు చెప్పట్లేదని ఏలేటి ప్రశ్నించారు. నిజంగా ఆధారాలు ఉంటే బీజేపీ ఎంపీ పేరు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పినా రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు.