
నిర్మల్, వెలుగు : నిర్మల్‌లో కొత్త మాస్టర్ప్లాన్రద్దు చేయాలని ఐదు రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆమరణ దీక్ష చేస్తుండగా సోమవారం వేకువజామున పోలీసులు భగ్నం చేశారు. పెద్ద సంఖ్యలో మహేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా దవాఖానకు తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే అనుమానపడుతున్న బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత మధ్య మహేశ్వర్ రెడ్డిని అంబులెన్స్ లో గవర్నమెంట్ దవాఖానకు తరలించారు. అక్కడ మహేశ్వర్ రెడ్డి నిరాకరించినా డాక్టర్లు సెలైన్లు ఎక్కించారు. దవాఖాన బయట పోలీసుల తీరును నిరసిస్తూ కార్యకర్తలు బైఠాయించారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసుల దౌర్జన్యం ఏమిటని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. దీక్షను యథావిధిగా కొనసాగించారు.
దీక్ష విరమింపజేసిన కిషన్ రెడ్డి
మహేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్యాహ్నం నిర్మల్‌కు చేరుకున్నారు. దవాఖానకు వెళ్లి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఆయనకు నచ్చజెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. తర్వాత కార్యకర్తలతో కలిసి కిషన్‌రెడ్డి.. మహేశ్వర్ రెడ్డితో ఇంటికి తరలివెళ్లారు. ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జిలో దెబ్బలు తిన్న కార్యకర్తలను చూసి కిషన్ రెడ్డి చలించిపోయారు. వారిని పరామర్శించి అధైర్య పడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన జీవో నెంబర్ 220 ను రద్దు చేస్తామన్నారు.
కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, ప్రవర్తన మార్చుకోని పోలీసుల్లారా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నిర్మల్ లోని భూ అక్రమాలను వెలికి తీసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీ పార్లమెంటు ఇన్చార్జ్ భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామ్నాథ్, డాక్టర్ మల్లికార్జున రెడ్డి, మెడిసిమ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, ఒడి సెల అర్జున్, అంజు కుమార్ రెడ్డి, సాదం అరవింద్, ముత్యం రెడ్డి, రమణారెడ్డి తదితరులున్నారు.