టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కౌరవుల్లా వస్తున్నరు

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కౌరవుల్లా వస్తున్నరు

చండూరు, వెలుగు: పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి చంద్రబాబు డైరెక్షన్​లో పని చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ లీడర్​ కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి విమర్శించారు. రేవంత్​కు అసలు రాజకీయ చరిత్రే లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి రాకముందు చిల్లర దొంగ అని మండిపడ్డారు. ఆదివారం నల్గొండ జిల్లా గట్టుప్పల్​ మండల బీజేపీ  కార్యకర్తల మీటింగ్ లో రాజగోపాల్​ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిదన్నారు. వందల కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని విమర్శించారు. తన కుటుంబాన్ని  విమర్శించే నైతిక అర్హత అతనికి లేదన్నారు. తమ కుటుంబానికి పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం  మంత్రి పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు.

వంద మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎదుర్కొంటాం

సీఎం కేసీఆర్ మునుగోడు ఎన్నికల్లో రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను పంపిస్తానని చెప్పారని,  100 మంది టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు వచ్చినా కౌరవ సైన్యాన్ని పాండవులు ఎదుర్కొన్నట్టు ఇక్కడి ప్రజలు ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నారని రాజగోపాల్​రెడ్డి అన్నారు. ధర్మయుద్ధంలో ప్రజలదే గెలుపన్నారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా తన రాజీనామా ఒక వ్యక్తి కోసం, పదవి కోసం కాదన్నారు.  ప్రశ్నించే గొంతుకలు లేకుండా కాంగ్రెస్  ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుగా డబ్బులిచ్చి కొనుగోలు చేసిన చరిత్రహీనుడు కేసీఆర్ అని విమర్శించారు.  ప్రాజెక్టుల పేరుతో వందల కోట్ల రూపాయలు దోచుకొని.. దాచుకున్న చరిత్ర కేసీఆర్ కే దక్కిందన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేసీఆర్, ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. 

బీజేపీలో 800 మంది చేరిక

గట్టుప్పల్​ మండలం ఏర్పాటు కావాలని ఏండ్ల తరబడి నిరసన దీక్షలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం, తాను అమిత్ షాను కలవగానే వణుకు పుట్టి గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించారని రాజగోపాల్​రెడ్డి అన్నారు. మునుగోడులో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మునుగోడులో తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయల ఖర్చు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు  చెప్పారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట వదిలి మునుగోడులో తిరగటం ఏంటని ప్రశ్నించారు. తాను అమ్ముడు పోయినట్టు ప్రచారం చేస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి, రేవంత్ రెడ్డి  ఏ గుడిలో ప్రమాణం చేస్తారో రావాలన్నారు. సమావేశం అనంతరం గట్టుప్పల్ మాజీ సర్పంచ్ నామనీ జగన్నాథంతో పాటు 800 మంది రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో  చేరారు.