ఐదో రోజుకు మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష ..... క్షీణిస్తున్న ఆరోగ్యం

ఐదో రోజుకు మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష ..... క్షీణిస్తున్న ఆరోగ్యం
  • నిర్మల్​లో ఐదో రోజుకు చేరిన ఆమరణ దీక్ష
  • క్షీణిస్తున్న మహేశ్వర్​రెడ్డి ఆరోగ్యం
  • భారీగా చేరుకున్న పోలీసు బలగాలు
  • పరామర్శకు వస్తున్న లీడర్లు, కార్యకర్తల అడ్డగింత  
  • మంత్రి ఐకేరెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ శ్రేణుల ప్రయత్నం 
  • అడ్డుకున్న పోలీసులు..
  • తోపులాట, లాఠీ చార్జి 
  •  బైల్ బజార్ వద్ద రాస్తారోకో 
  •  పట్టణంలో ఉద్రిక్తత  

నిర్మల్, వెలుగు : నిర్మల్​మాస్టర్ ప్లాన్ తో పాటు జీవో నెంబర్ 220ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో బీజేపీ రాష్ట్రస్థాయి నేతలంతా నిర్మల్ కు తరలివచ్చి మహేశ్వర్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిర్మల్ కు అదనపు బలగాలను రప్పించారు. కాగా, మహేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు వివిధ గ్రామాల నుంచి వస్తున్న కార్యకర్తలను ఎక్కడివారిని అక్కడే పోలీసులు అరెస్ట్​చేసి పీఎస్​లకు తరలించారు. అలాగే మహేశ్వర్ రెడ్డి ఇంట్లోకి ఎవరినీ రానివ్వకుండా గేటు వద్ద అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆయన ఇంటి ముందే బైఠాయించిన కార్యకర్తలు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీ సంఖ్యలో మహేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డగించారు. వారిని చేధించుకొన్న కొందరు కార్యకర్తలు ముందుకు దూసుకువెళ్లారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు మంత్రి ఇంటి నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు రోడ్డును దిగ్బంధించారు. ఒకదశలో పోలీసులు,  కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. అయినప్పటికీ బైల్ బజార్ వద్ద మెయిన్ రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినదించారు. వెంటనే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని, జీవో నెంబర్ 220ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. ఇదిలా ఉండగా సాయంత్రం తర్వాత మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

మహేశ్వర్ రెడ్డికి మహారాష్ట్ర ఎమ్మెల్యే సంఘీభావం

మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్కెడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే తుషార్ గోవింద్ రావు రాథోడ్ ఆదివారం నిర్మల్​కు వచ్చారు. మహేశ్వర్ రెడ్డి దీక్ష స్థలి వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. మహేశ్వర్ రెడ్డి  ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జీని తీవ్రంగా ఖండించారు. గాయపడ్డ నాయకులను, కార్యకర్తలను పరామర్శించారు.  ఇకనైనా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించాలని, తక్షణమే జీవోతో పాటు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

కొనసాగుతున్న రైతుల దీక్షలు

మరోవైపు మాస్టర్ ప్లాన్  రద్దు చేయాలని మంజులాపూర్, తల్వేద పాటు వివిధ వార్డులకు చెందిన రైతులు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. రైతులకు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. పలువురు నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. కాగా, ఆదివారం నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జీ.ఈశ్వర్ రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రైతులు సూచించిన అంశాలను అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఎవరికి నష్టం వాటిల్లకుండా మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై సోమవారం మున్సిపల్ ఆఫీసులో పాలకవర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, మాస్టర్​ప్లాన్​గురించి కేవలం మున్సిపల్ చైర్మన్ మాత్రమే మాట్లాడుతున్నారని, ప్రభుత్వం స్పందించి రద్దు చేస్తామని ప్రకటించాలని రైతులు డిమాండ్​చేశారు. అంత వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.  
ఇయ్యాల నిర్మల్​కు కిషన్​రెడ్డి
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి సోమవారం నిర్మల్​కు రానున్నారు. నిర్మల్​మాస్టర్​ ప్లాన్​ కోసం తెచ్చిన జీవో 220ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలపనున్నారు. శనివారం పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన కార్యకర్తలను  కిషన్​రెడ్డి 
పరామర్శించనున్నారు.

ఆదిలాబాద్​లో ఆందోళన ఉద్రిక్తం 

ఆదిలాబాద్ ​టౌన్ : నిర్మల్​జిల్లాలో ఏలేటి ఆమరణ దీక్ష సందర్భంగా శనివారం బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్​లోని నేతాజీ చౌక్​లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు బీజేపీ లీడర్లను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పాయల్​శంకర్​గాయపడడంతో పాటు అంగీ చినిగిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లీడర్లు, కార్యకర్తలు అక్కడి నుంచి సరాసరి వన్​టౌన్​పోలీస్​స్టేషన్ కు వెళ్లి ​ధర్నా చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న పోలీసులను ఉసిగొల్పి దాడి చేయిస్తున్నాడని ఆరోపించారు. నిర్మల్​లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆస్తులను పెంచుకొనేందుకు నిర్మల్ మాస్టర్ ప్లాన్ తెర పైకి తీసుకొచ్చారన్నారు. నిర్మల్​లో బీజేపీ నేతలపై లాఠీచార్జీని ఖండిస్తూ తాము శాంతియుతంగా నిరసన చేపడితే పోలీసులు జోగు రామన్న తొత్తులుగా మారి తమపై దాడి చేశారన్నారు. మరోవైపు బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు, జడ్పీ మాజీ చైర్మన్​సుహాసినీరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్​ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, లాలా మున్న, రఘుపతి, నగేశ్, అంకత్ రమేశ్, ఆకుల ప్రవీణ్, జోగు రవి, జ్యోతిరెడ్డి, సోమ రవి, దినేష్ మాటోలియా, రాళ్ల బండి మహేందర్ పాల్గొన్నారు.