
రాబోయే ఎన్నికల్లో తాను మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్ మురళీధర్ రావు చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారని, స్ట్రాటజీ మిస్ అవుతున్నారని అన్నారు. కర్నాటకలో కుమారస్వామిని వదిలేశారన్నారు. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ను ఢీ కొట్టలేరని, ఆయన్ను ఎదుర్కోవాలంటే ఇచ్చిన హామీలు..వాటి అమలులో ఉన్న తేడాతోనే ఢీకొట్టాలని చెప్పారు. అయితే.. అన్ని సమయాల్లోనూ సంక్షేమ పథకాలతో ఓట్లు రావన్నారు.
తెలంగాణలో 65 శాతం మంది యువతీ, యువకులు ఉన్నారని, ఇందులో చాలామంది కేసీఆర్ కు వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కేసీఆర్ తిరుగుతున్నారని అన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ ఇస్తుంది కానీ బీజేపీ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మాదిరిగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ హామీలు ఇచ్చినా... వారిని ప్రజలు నమ్మరని చెప్పారు. తమ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్.. కాంగ్రెస్ వాళ్లకంటే ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పారు.
బీఆర్ఎస్ ను ఓడించాలని యువత డిసైడ్ అయితే.. వారి ఓట్లు ఎవరికి పడితే వాళ్లే మొనగాళ్లు అని చెప్పారు. అవినీతి చేసినోళ్లు జైలుకు పోవాల్సిందేనని, అందుకే జైళ్లు కడుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు కారణంగా పార్టీ డ్యామేజీ అయ్యిందనడం కరెక్ట్ కాదన్నారు. అధ్యక్షుడిని ఎందుకు మార్చారనేది మార్చిన వాళ్లకు బాగా తెలుసన్నారు. నేతలను కలుపుకొనిపోవడం కోసం హైకమాండ్ బండి సంజయ్ ని తప్పించింది కావొచ్చన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత వాళ్లు ఆ పార్టీలో ఉండరని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. దాన్ని పోగొట్టడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ కు చెందిన పెద్ద లీడర్లే పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు.