హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ సంఘాల ఓటు బ్యాంకును సంతృప్తిపరిచే రాజకీయాలతోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పిందంటూ కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో జీతాలు, పెన్షన్ల భారం ప్రమాదకర స్థాయికి చేరిందన్న సీఎస్ వ్యాఖ్యలు.. ఇన్నాళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న హెచ్చరికలను నిజం చేశాయన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. 16వ ఆర్థిక సంఘం చర్చల సందర్భంగా సీఎస్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కారు ఆర్థిక అస్తవ్యస్తత పాలనను వెలుగులోకి తెచ్చాయని విమర్శించారు. 2014లో రాష్ట్రంలో నెలవారీ జీతాలు, పెన్షన్ల ఖర్చు సుమారు రూ.1,500 కోట్లు ఉండగా.. ప్రస్తుతం అది ఏకంగా రూ.6 వేల కోట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.
