- బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలను మరింత అప్పుల పాలు చేసేందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. అప్పుల కోసమే విస్తీర్ణం పెంచుతున్నారని పేర్కొన్నారు. కొత్త డివిజన్లలో ఒక్కోచోట ఒక్కో విధంగా ఉందని, ఎక్కడా యూనిఫాం మెథడ్ కొనసాగించడం లేదని తెలిపారు. కొత్త డివిజన్ పరిధి పాత డివిజన్ పరిధికి వ్యత్యాసం ఉందని చెప్పారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కమీషన్, కాంట్రాక్ట్ కోసమే అన్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మజ్లిస్ కు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. విలీనం కారణంగా చేతి వృత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అఖిలపక్ష సమావేశం లేకుండా కేవలం దారుస్సలాంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారని ఎద్దేవా చేశారు.
