- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
నిజాంపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కొందరు బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ లుగా పనిచేస్తున్నారని, అలాంటి వారి వల్లే ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్నిచోట్ల పార్టీకి నష్టం జరుగుతోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మెదక్జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాలో పోలీస్ అధికారులు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులపై మాజీ మంత్రి హరీశ్ రావు కమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, కేటీఆర్ తమ ప్రభుత్వం అధికారంలో ఉందనే భ్రమలో మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పెయిడ్ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ మీడియాలో వచ్చిన దాన్ని ట్రోల్ చేస్తున్నారన్నారు. పోలీస్ అధికారులు ఎక్కడ రియాక్ట్ కావాలోఅక్కడ రియాక్ట్ అయి యాక్షన్ తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో మొదటి, రెండో విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 75 శాతం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందన్నారు. కల్వకుంటలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన జర్నలిస్ట్ రంగరాజ్కిషన్కు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కల్వకుంట మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, ఆయన అనుచరులు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో డీసీసీ ప్రసిడెంట్ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు సుప్రభాత్రావు, వెంకటేశ్ గౌడ్, అమర్సేనా రెడ్డి, నసీరుద్దీన్, యాదగిరి పాల్గొన్నారు.
