అమ్మకానికి బీఆర్ఎస్​ఎంపీ టికెట్లు

అమ్మకానికి బీఆర్ఎస్​ఎంపీ టికెట్లు
  • లోక్​సభ ఎన్నికల్లో ఆపార్టీకి సున్నా సీట్లే

  • ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం

  • కావాలనే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు

  • బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ టికెట్లను అమ్మకానికి పెట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ పార్టీని ఖతం చేసేందుకు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని స్పష్టంచేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  ఏర్పాటుచేసిన ప్రెస్​మీట్ లో ఆయన మాట్లాడారు. ‘మెదక్ ఎంపీ సీటును నాడు కలెక్టర్ గా పనిచేసి, కేసీఆర్ కాళ్లు మొక్కిన ప్రస్తుత ఎమ్మెల్సీకి బేరం పెట్టినట్లు బీఆర్ఎస్ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వందల కోట్లు ఉన్నోళ్లకే ఆ పార్టీలో టికెట్లు ఇస్తున్నారన్నారు.

 ఉద్యమకారులకు, కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో టికెట్లను ఇస్తామని లోక్ సభ నియోజకవర్గాల సమీక్షలో కేటీఆర్, హరీశ్​స్పష్టం చేశారు. దీనిపై మాట తప్పమని అమరవీరుల స్థూపం వద్ద బావా, బామ్మర్ది ప్రమాణం చేయాలి. రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ను బీజేపీ ఖతం చేస్తుందని మాపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పన్నారు.   బీఆర్ఎస్ ను అంతం చేయడానికి వేరొకరితో చేతులు కలపాల్సిన అవసరం మాకు లేదు. మేం ఒంటరిగానే పోటీ చేస్తం. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల్లో ఎందుకు సమీక్ష చేసుకుంట లేరు. ఎమ్మెల్సీ  కవితకు ఎంపీ సీటు ఇస్తారా లేదా? ఇప్పుడు భారత జాగృతి సమితి పెట్టుకొని తిరుగుతున్నరు. దీనిపై క్లారిటీ ఇవ్వండి.

 బీజేపీపై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికైనా మరోసారి గుర్తు చేస్తున్న....మీ కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేయండి. మిగిలిన 12 ఎంపీ టికెట్లు ఉద్యమకారులకు, కార్యకర్తలకు ఇవ్వండి. మళ్లీ డబ్బున్న వారికి బీ ఫామ్ లు అమ్ముకోకండి. అయినా రాబోయే లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేది లేదు. సచ్చేది లేదు. ఆ పార్టీకి సున్నా సీట్లే’ అని రఘునందన్​తెలిపారు