బ్రాహ్మణులు, వైశ్యులు నా రెండు జేబుల్లో ఉన్నారు

బ్రాహ్మణులు, వైశ్యులు నా రెండు జేబుల్లో ఉన్నారు

భోపాల్: బ్రాహ్మణులు, వైశ్యులు తన రెండు జేబుల్లో ఉన్నారంటూ బీజేపీ  జనరల్ సెక్రటరీ పి.మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మురళీధర్ రావు భోపాల్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఓట్ల కోసం ఇలా చేయట్లేదని.. ఎస్సీ, ఎస్టీల్లో వెనకబాటుతనాన్ని పోగొట్టడంతోపాటు వారికి ఉద్యోగాలు కల్పించడం, విద్యను అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తామని అన్నారు. అనంతరం బీజేపీ రాజకీయంగా బ్రాహ్మణులు, బనియా (వైశ్యులు)లకు చెందినదిగా ముద్ర పడిందని.. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామంటూనే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలపై స్పెషల్ ఫోకస్ పెడతామని ఎలా అంటారని జర్నలిస్టులు మురళీధర్ రావును ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. బ్రాహ్మణులు, వైశ్యులు తన పాకెట్స్‌లో ఉన్నారని చెప్పారు. 

‘మీడియా వాళ్లు మమ్మల్ని (బీజేపీని) బ్రాహ్మణులు, వైశ్యుల పార్టీగా పిలుస్తారు. బీజేపీలో ఈ రెండు కమ్యూనిటీలకు చెందిన ఓటు బ్యాంకు, కార్యకర్తలు  ఉన్నారు. ఒక పార్టీలో ఏ వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటే.. ఆ పార్టీ వారిదేనని ముద్ర వేస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజల్ని మా పార్టీలో చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. బీజేపీ అన్ని వర్గాల ప్రజలది. పార్టీని అలా మార్చే యత్నాల్లో బిజీగా ఉన్నాం’ అని మురళీధర్ రావు అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ఫైర్ అయ్యారు. సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్ అనేది బీజేపీ స్లోగని అని.. కానీ బ్రాహ్మణులు, వైశ్యులు తమ జేబుల్లో ఉన్నారని మురళీధర్ రావు అంటున్నారని కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయా కులాల వారిని అవమానించడమేనన్నారు. ఇన్నేళ్లుగా బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన బ్రాహ్మణ, వైశ్య నేతలను ఇలాగేనా గౌరవించేదంటూ మండిపడ్డారు. కాగా, మురళీధర్ తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై స్పందించారు. తన కామెంట్లను ప్రతిపక్షాలు  వక్రీకరించాయని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

భర్త కొట్టాడంటూ పోలీసులకు పూనమ్ పాండే ఫిర్యాదు

స్నేహితుడి భార్యతో ప్రేమ.. చివరకు జైలు

ఐటీ, ఈడీ దాడులతో సోనూసూద్‌‌ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం