కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు పెరిగాయ్

కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు పెరిగాయ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. శనివారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. టీకా కోసం వచ్చిన వారిని అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఆ తర్వాత విజయశాంతి మాట్లాడుతూ.. కరోనా సోకినప్పుడు కేసీఆర్ పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని మండిపడ్డారు. 

‘కేసీఆర్‌కు కరోనా సోకినప్పుడు యశోదా ఆస్పత్రిలో ఎందుకు చికిత్స తీసుకున్నారు? పారాసిటమాల్ గోలితో కరోనా పోతున్నట్లు భ్రమ కల్పించారు. కేసీఆర్ బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే ఎంతోమంది మ‌ృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పూర్తి ఉచితంగా అందిస్తున్నారు’ అని విజయశాంతి పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించినట్లు చెప్పారు.