ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను మోసం చేసిండు

ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను మోసం చేసిండు
  • తెలంగాణకు తొలి సీఎం చేస్తానని కేసీఆర్‌ మాట తప్పిండు
  • మున్సిపోల్స్‌‌లో గూండాగిరితో గెలవాలనుకుంటున్నరు
  • ప్రతిపక్ష క్యాండిడేట్లను టీఆర్‌‌ఎస్‌‌ బెదిరిస్తోంది
  • మాజీ ఎంపీ,బీజేపీ నేత వివేక్‌‌ వెంకటస్వామి
  • గజ్వేల్, హుస్నాబాద్‌‌లలో ప్రచారం

సిద్దిపేట, హుస్నాబాద్, వెలుగు:

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్‌‌ దళితులను మోసం చేశారని, ఇప్పుడు కొడుకును సీఎం చేసేందుకు రెడీ అయిపోయారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌‌ వెంకటస్వామి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని టీఆర్‌‌ఎస్‌‌కు ఓటెందుకు వెయ్యాలని ప్రశ్నించారు. మున్సిపల్‌‌ ఎన్నికల్లో గూండాగిరి, దౌర్జన్యాలు చేసి గెలవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని, తిరగబడతారన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, హుస్నాబాద్‌‌లలో బీజేపీ క్యాండిడేట్లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ కేసీఆర్‌‌ మోసం చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీల క్యాండిడేట్లను కొనేందుకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చెన్నూరులో అధికార పార్టీ ఆగడాలు ఎక్కువయ్యాయని, పోటీలో ఉన్నవాళ్లను కిడ్నాప్‌‌ చేయడానికి కూడా వెనుకాడడం లేదన్నారు. పోలీస్‌‌ల ద్వారా క్యాండిడేట్లను బెదిరిస్తూ గెలవాలని చూస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పైచేయి సాధించేందుకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రయత్నిస్తోందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తర్వాత సీఎం కేటీఆర్‌‌ అంటూ మంత్రులతో ఒకవైపు ప్రచారం చేయిస్తూనే.. ఆ పదవిపై ఆశలేదంటూ కేటీఆర్‌‌ అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మున్సిపల్‌‌ మంత్రిగా కేటీఆర్ ఫెయిలయ్యారని, ఆయన పట్టణాలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. అందుకే అవి మురికికూపాలుగా మారాయని, ఎక్కడ చూసినా చెత్తచెదారమేనని, రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయన్నారు. కేంద్రం నిధులను పక్కదారి పట్టించారని, వాటి గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నారన్నారు. కేసీఆర్‌‌ నియంత పాలనను అంతం చేయాలని, బీజేపీకి ఓటేస్తేనే పట్టణాలు డెవలప్‌‌ అవుతాయన్నారు. కేసీఆర్‌‌ కుటుంబం గచ్చిబౌలిలో వేలాది ఎకరాలు ఎవరి డబ్బులతో కొన్నదని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు

ధర్మపురి/జగిత్యాల, వెలుగు: ‘ఖబడ్దార్‌ కేసీఆర్.. మీకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీ గూండాలకు జనం భయపడే పరిస్థితి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలవడం ఖాయం’ అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం ధర్మపురిలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసిగి ఉన్నారని, ఎక్కడికెళ్లినా బీజేపీ క్యాండిడేట్లకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. నిర్భయంగా ఓటేసే హక్కును అంబేద్కర్‌ కల్పిస్తే, టీఆర్‌ఎస్‌ ఆ హక్కును కాలరాస్తోందన్నారు. అభివృద్ధిని చూపించి ఓట్లడిగే ధైర్యం కేసీఆర్‌కు లేదని, అందుకే కాళేశ్వరం కమీషన్లతో ఓట్లు కొనాలని చూస్తున్నారన్నారు. ఇతర పార్టీల్లో గెలిచే వాళ్లను కొని పైచేయి సాధించాలని కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ధర్మపురిలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ అరాచకాలు ఎన్నాళ్లూ సాగవన్నారు. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని, కొన్ని పార్టీలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. మజ్లిస్‌ కావాలనే రెచ్చగొడుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని అర్థమైందని, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదన్నారు.

BJP leader Vivek Venkata Swamy campaign in support of BJP candidates in Gadwal