ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం

ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం

ఖమ్మం లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో.. ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించడంతో అక్కడ కలకలం రేగింది. అక్కడున్న ఇతరులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 

గత కొంతకాలంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ పలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పై లేని ఆరోపణలు చేస్తున్నారని ఖమ్మం జిల్లా పార్టీకి చెందిన బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈక్రమంలో.. మే 16వ తేదీ సోమవారం టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టింది. దీంతో మే 17వ తేదీ మంగళవారం నిరసనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది.

అయితే.. నిరసనలు చేపట్టేందుకు పర్మిషన్ లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా.. బీజేపీ నేతలు నిరసనలు తెలియచేసేందుకు రోడ్లపైకి వచ్చారు. ఆ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు బీజేపీ కార్యకర్త ఉపేందర్. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మంత్రి పువ్వాడ అజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు బీజేపీ కార్యకర్తలు. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.