కేసీఆర్​.. బెదిరిస్తే బెదరడానికి కుటుంబ పార్టీ అనుకున్నవా? : కిషన్​రెడ్డి

కేసీఆర్​.. బెదిరిస్తే బెదరడానికి కుటుంబ పార్టీ అనుకున్నవా? : కిషన్​రెడ్డి
  • తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీలంటే భయమెందుకని ప్రశ్న
  • రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా: బండి సంజయ్
  • మూడు రోజుల బీజేపీ శిక్షణ శిబిరాలు ప్రారంభం
  • సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, వివేక్ వెంకటస్వామి, అర్వింద్ హాజరు

హైదరాబాద్, వెలుగు: కుటుంబ పాలన, అవినీతిపైనే బీజేపీ పోరాటమని, అదే తమ సిద్ధాంతమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌పై తమకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని, ఆయనకు తమపై వ్యక్తిగతంగా కక్ష ఉంటే ఉండొచ్చని, అది వేరే విషయమని చెప్పారు. కుటుంబ పాలన, అవినీతితో దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘కుటుంబ పాలనలో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందుకే రాష్ట్రంలో టీఆర్ఎస్‌‌కు వ్యతిరేకంగా మా పార్టీ ఉద్యమిస్తున్నది” అని తెలిపారు. ప్రగతి భవన్‌‌లో, ఫామ్‌‌హౌస్‌‌లో కూర్చొని ప్రధాని మోడీని విమర్శిస్తే తన ఇమేజ్ పెరుగుతుందనే భావనతో కేసీఆర్ ఉన్నారని, అందుకే పదే పదే మోడీని, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీని నైతికంగా విమర్శించే అర్హత కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. ‘‘ప్రపంచ దేశాలు మోడీని మెచ్చుకుంటుంటే.. తెలంగాణ సీఎంగా ఉంటూ కేసీఆర్ ఇట్లా ఎందుకు చేస్తున్నారని దేశమంతా నవ్వుకుంటున్నరు” అని అన్నారు. మూడు రోజుల బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాలు ఆదివారం శామీర్ పేటలోని ఓ రిసార్ట్‌‌లో ప్రారంభమయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభోపన్యాసం చేయగా.. తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడారు. 

కేసీఆర్.. భుజాలు తడుముకుంటున్నడు

ఫామ్‌‌హౌస్‌‌ ఫైల్స్ వ్యవహారం చూస్తే కొండను తవ్వి తొండను పట్టినట్లుందని కిషన్‌‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘బెదిరిస్తే బెదరడానికి మాదేమైనా కుటుంబ పార్టీనా? ఇలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాం.. ప్రాణాలిచ్చామే తప్ప బెదరలేదు..” అని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను చూపుతూ బీజేపీ బెదిరిస్తున్నదని కేసీఆర్ ఆరోపణలు చేయడంపై కిషన్ రెడ్డి స్పందించారు. ‘‘ఈ సంస్థలు దాడులు చేయడం ఇప్పుడే కొత్తనా? బీజేపీ వచ్చిన తర్వాతే ఇవి పని చేస్తున్నాయా? అవినీతి, అక్రమాలపై వచ్చే సమాచారం ఆధారంగానే ఆయా సంస్థలు దాడులు చేస్తాయి. ‘ఎవరు అక్రమాలకు పాల్పడినా, అవినీతికి పాల్పడినా మీ బాధ్యత నిర్వర్తించండి’ అని ప్రధాని హోదాలో మోడీ ఆ సంస్థలను ఆదేశించడం తప్ప ఫలానా వాళ్లపై దాడులు చేయాలని ఎప్పుడూ.. ఎక్కడా.. చెప్పలేదు” అని స్పష్టం చేశారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునే రీతిలో కేసీఆర్ ఉన్నారని, తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీలంటే భయమెందుకని, సీబీఐకి భయపడి ఆ సంస్థను రాష్ట్రంలోకి రానీయకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు.

మునుగోడు తీర్పుపై బాధపడాల్సిన పని లేదు

40 ఏండ్లుగా సంస్థాగత విషయాల్లో ప్రపంచంలోనే బీజేపీ.. తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటున్నదని కిషన్‌‌రెడ్డి అన్నారు. పోలింగ్ బూత్ కమిటీ నుంచి జాతీయస్థాయి వరకు ప్రత్యేక రాజ్యాంగం ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. తమ పార్టీలో ఎవరైనా ప్రెసిడెంట్ కావచ్చన్నారు. కానీ కుటుంబ పార్టీల్లో అలా ఉండదన్నారు. సాధారణ కార్యకర్తలు కూడా ఉన్నత స్థానంలో ఉన్న పార్టీ తమదేనన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తాను పర్యటిస్తున్న సందర్భంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అని ఆసక్తిగా అడుగుతున్నారని చెప్పారు. మునుగోడు తీర్పుపై ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని, గెలిచి ఓడామే తప్ప నిరుత్సాహం వద్దన్నారు. 

ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలి: సంజయ్

దేశంలో, రాష్ట్రంలో అడ్డదారులు తొక్కే అనేక పార్టీలు అధికారంలో వచ్చాయని, కానీ బీజేపీ మాత్రం ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నదని సంజయ్ అన్నారు. జన సంఘ్ నుంచి నేటి వరకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యయుతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి చాలా కాలం పట్టిందన్నారు. ‘‘7 వేల పార్టీలు ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. కాని అందులో బీజేపీ చరిత్ర, సిద్ధాంతం మరే పార్టీకి లేదు. మూల సిద్ధాంతంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నాం” అని వివరించారు. మూడ్రోజుల పాటు జరగనున్న ఈ శిబిరంలో 14 అంశాలపై చర్చిస్తామన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఎంపీలు అర్వింద్, సోయం బాపూరావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, నేతలు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్, బంగారు శృతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రశిక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మార్పును ఎవ్వరూ ఆపలేరు

‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నారు.. చాలాసార్లు మా పార్టీని ఆశీర్వదిస్తూనే ఉన్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూతరును, బంధువును ఓడించాం. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు ఫలితాలను పరిశీలిస్తే.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలిసిపోతుంది. కుటుంబ పాలనలో టీఆర్ఎస్ నాయకులు ఎలా నలిగిపోతున్నారో చాల సందర్భాల్లో వారిని చూస్తే తెలిసిపోతుంది.. వారు కూడా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.. వారే కాదు రాష్ట్రంలోని చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు సైతం  బీజేపీ పవర్లోకి వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారు” అని కిషన్ రెడ్డి చెప్పారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో మార్పు రాబోతున్నదని అన్నారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా.. మరెన్ని దౌర్జన్యాలు చేసినా రాష్ట్రంలో మార్పు తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని, తెలంగాణ ప్రజలు ఎవరిని అధికారంలోకి తీసుకురావాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు.

రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్ కుటుంబమే

దేశం బాగుపడాలంటే కేసీఆర్ కుటుంబమే అధికారంలోకి రావాలంటున్నారని, తెలంగాణకు కేంద్రం ఏమీ చేయడం లేదంటున్నారని కిషన్‌‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఏం చేసిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైదరాబాద్ నడిబొడ్డున ప్రజలకు వివరించబోతున్నానని స్పష్టం చేశారు. ‘‘మేం ఏనాడూ తెలంగాణకు అన్యాయం చేయలేదు.. రాష్ట్రానికి ఎవరైనా అన్యాయం చేశారంటే అది కేసీఆర్ కుటుంబమే. ఇక్కడ అధికారంలో ఉన్నది టీఆర్ఎస్.. జవాబు చెప్పాల్సిన పార్టీ ఇదే.. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు’’ అని అన్నారు. టీఆర్ఎస్  కుట్రలను తిప్పికొట్టేందుకు బీజేపీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తున్నదని, భవిష్యత్తులో అవినీతి రహిత పాలనను అందించేది తమ పార్టీ మాత్రమేనన్నారు. ‘‘కేసులు పెట్టినా.. జైళ్లకు పంపినా పోరాటానికి సిద్ధంంగా ఉండాలి. మడమ తిప్పకూడదు.. మనం జైలుకు పోతే ఉద్యమం ఆగదు.. లక్షలాది మంది ప్రజలే ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారు” అని కిషన్ రెడ్డి  అన్నారు.

పార్టీని మరింత బలోపేతం చేస్తాం: తరుణ్​చుగ్​

బీజేపీ ట్రైనింగ్ క్లాసుల్లో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ వ్యవహార శైలిపై చర్చిస్తామని ఆ పార్టీ రాష్ర్ట ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ వెల్లడించారు. ఆదివారం శామీర్ పేటలోని ట్రైనింగ్ క్లాసుల దగ్గర మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. మంగళవారం దాకా జరగనున్న శిక్షణ తరగతుల్లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ ఆధ్వర్యంలో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ స్కీమ్ లు, వాటి అమలు తీరు, ప్రజా సమస్యలు అన్నీ చర్చిస్తామన్నారు. కేసీఆర్ అహంకారం రోజు రోజుకు మరింత పెరుగుతూ  హింసగా మారుతున్నదని విమర్శించారు. ఇందులో భాగంగా ఎంపీ అర్వింద్​ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఈ దాడి దుర్మార్గమని ఖండించారు.