బీజేపీ లీడర్లు బస్సు యాత్రకు బదులు.. ఢిల్లీకి పాదయాత్ర చేస్తే బెటర్‌‌

బీజేపీ లీడర్లు బస్సు యాత్రకు బదులు.. ఢిల్లీకి పాదయాత్ర చేస్తే బెటర్‌‌
  •     కేంద్రాన్ని ఒప్పించి వడ్లు కొనేలా చేస్తే బీజేపీ లీడర్లకు క్షీరాభిషేకం చేస్తం
  •  బీఆర్‌‌ఎస్‌‌ బొందలగడ్డ పార్టీ అని ఎప్పుడో చెప్పిన: మంత్రి కోమటిరెడ్డి 


నల్గొండ, వెలుగు : ‘బీజేపీ లీడర్లు బస్సు యాత్రకు బదులు ఢిల్లీకి పాదయాత్ర చేస్తే బెటర్‌‌’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన 90 లక్షల టన్నుల వడ్లను కేంద్రం తీసుకునేలా ప్రధాని మోదీని ఒప్పిస్తే అన్ని గ్రామాల్లో బీజేపీ నాయకులకు క్షీరాభిషేకం చేస్తామన్నారు. వడ్ల కొనుగోళ్లు పూర్తి కావస్తున్న సమయంలో బీజేపీ నాయకులు బస్సు యాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

నల్గొండ జిల్లా కనగల్‌‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మాణ పనులను ఆదివారం తనిఖీ చేశారు. నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తూ, పనులను స్పీడ్‌‌గా పూర్తి పూర్తి చేయాలని ఆదేశించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. 

గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్కసారి కూడా ఎంజీ యూనివర్సిటీలో కాలు పెట్టలేదన్నారు. ఎంజీయూను రాష్ట్రంలోనే బెస్ట్‌‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దామని, ఈ విద్యా సంవత్సరం నుంచి ఫార్మసీ, డీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎల్‌‌ఎల్‌‌బీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తాయన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ బొందలగడ్డ పార్టీగా మారుతుందని తాను ఎప్పుడో చెప్పానన్నారు. కర్నాటకలో డీకే శివకుమార్, తెలంగాణలో తాను కాంగ్రెస్‌‌ కోసం ఊరూరు తిరిగి కష్టపడ్డ వాళ్లమేనని అన్నారు.

 కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన మాటకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ నిబద్ధతకు నిదర్శనమన్నారు. దేశంలో 15  రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, రాహుల్‌‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను కార్లో తిరిగినా, బైక్‌‌ మీద, హెలికాప్టర్‌‌లో తిరిగినా జిల్లా అభివృద్ధి కోసమేనని చెప్పారు. రాష్ట్రంలో రూ.13,600 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. మిషన్‌‌ భగీరథ పేరుతో ఉమ్మడి జిల్లాలో రూ. 6 వేల కోట్లు దుర్వినియోగం చేశారని, ఈ పథకాన్ని అడ్డుపెట్టుకొని కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. 

మంత్రి వెంట మాజీ జడ్పీటీసీలు నర్సింగ్‌‌ శ్రీనివాస్‌‌గౌడ్‌‌, చిట్ల వెంకటేశం, ఆర్టీఏ డైరెక్టర్‌‌ కూసుకుంట్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌‌ బిక్షం యాదవ్, ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయ చైర్మన్‌‌ చీదేటి వెంకట్‌‌రెడ్డి, సర్పంచ్‌‌ నర్సింగ్‌‌ మురళీధర్‌‌ పాల్గొన్నారు.