
- మంత్రి అక్రమాలను దశలవారీగా వెల్లడిస్తాం
- ఇంద్రకరణ్‌రెడ్డి బంధువుల పాత్ర కూడా ఉంది
- ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరించాం
- మీడియాతో బీజేపీ నాయకులు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో జరుగుతున్న అక్రమ భూముల వ్యవహారంలో మంత్రి బంధువుల హస్తం ఉందని, అలాగే వీరందరికీ మంత్రి అండగా నిలుస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం స్థానిక బీజేపీ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మ రాజు, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, రాచకొండ సాగర్, నాయుడు మురళి మాట్లాడారు. జిల్లాలోని న్యూ లింగంపల్లి, రత్నాపూర్ తదితర గ్రామాల్లో మంత్రి బంధువులు, అనుచరులు వందల ఎకరాల భూములను డీ వన్ పట్టాల పేరిట స్వాహా చేశారన్నారు. మామడ మండలం న్యూ లింగంపల్లిలోని 18 సర్వే నంబర్లోని భూమిలో బై నెంబర్లతో దాదాపు 100 ఎకరాల భూములను కబ్జా చేశారన్నారు.
మంత్రితోపాటు ఆయన బంధువులకు సంబంధించిన భూ ఆక్రమణల వివరాలను దశలవారీగా వెల్లడిస్తామన్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఆర్టీఏ ద్వారా సేకరించామన్నారు. జనవరి 10 లోగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన బంధువులు ఆక్రమించిన భూములను పేదలకు పంచాలని, మున్సిపల్ సిబ్బంది నియామకం కోసం నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలన్నారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. నిర్మల్ లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం బీజేపీ లీడర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపిం చడం కరెక్ట్‌కాదన్నారు.