లా అండ్‌ ఆర్డర్‌ను రక్షించండి..డీజీపీకి బీజేపీ నాయకుల వినతి

లా అండ్‌ ఆర్డర్‌ను రక్షించండి..డీజీపీకి బీజేపీ నాయకుల వినతి

బషీర్‌బాగ్‌, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌, మజ్లిస్ అరాచకాలకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టి లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడాలని కోరుతూ బీజేపీ నాయకులు బుధవారం డీజీపీ శివధర్‌రెడ్డిని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డితో పాటు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆఫీస్‌పై జరిగిన దాడి, బాన్సువాడలో హిందూ యువతిపై దాడి ఘటనలతో పాటు ఇటీవల రాష్ట్రంలో హిందువులు, దేవాలయాలపై జరుగుతున్న దాడులను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌, మజ్లిస్ కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు,  హిందువులపై దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.