సీఎం వస్తున్నారని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు

సీఎం వస్తున్నారని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు
  • సీఎం వస్తున్నారని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు
  • బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు, అంగన్ వాడీ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు అదుపులోకి  
  • కేసీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు 
  • అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించిన పోలీసులు   

వెలుగు, నెట్​వర్క్ :  పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ ని శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాల్లో బీజేపీ, బీజేవైఎం నాయకులు అడ్డుకొని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ లో భూములు కోల్పోయిన ఆమనగల్లు మండలం పోలేపల్లి, సింగంపల్లి, కొత్తకుంట తండాల నిర్వాసితులకు పరిహారం అందించాలని కోరారు. 

ముందస్తు అరెస్ట్ లు.. 

సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ లీడర్లను, సమ్మెలో పాల్గొంటున్న అంగన్​వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉప్పునుంతలలో కాంగ్రెస్  లీడర్లను, బాలానగర్ మండలంలో బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పీఎస్ లకు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వనపర్తి నర్సింలు, జిల్లా నాయకులు పల్లె శేఖర్ తదితరులు ఉన్నారు.

కల్వకుర్తి పట్టణంలో అర్ధరాత్రి బీజేపీ, ఏబీవీపీ, అంగన్​వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అరెస్ట్​ చేశారు. పట్టణంలో చిరు వ్యాపారుల దుకాణాలను పోలీసులు బలవంతగా బంద్  చేయించారు. ఆర్టీసీ బస్సులను కేసీఆర్ మీటింగ్​కు తరలించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. స్కూల్ బస్సులను సైతం జనాలను తరలించేందుకు వాడుకోవడంతో ప్రైవేట్​ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సీఎం పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.