నిజామాబాద్ లో ఉత్కంఠ.. 28 డివిజన్ లలో కమలం పార్టీ విజయం

నిజామాబాద్ లో ఉత్కంఠ.. 28 డివిజన్ లలో కమలం పార్టీ విజయం
  •     కాంగ్రెస్ కు 17, మజ్లిస్​కు14 స్థానాలు
  •     1 డివిజన్ కే పరిమితమైన బీఆర్ఎస్ 
  •     ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. మేయర్ పీఠంపై ఉత్కంఠ 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్​లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందినా.. మేయర్​ ఎన్నిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఆ పార్టీ 28 డివిజన్లలో గెలుపొందగా.. కాంగ్రెస్ పార్టీ 17, మజ్లిస్ 14, బీఆర్ఎస్ ఒక డివిజన్​లో విజయం సాధించాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచే బీజేపీ హవా కొనసాగింది. 1,562 పోస్టల్ బ్యాలెట్​లలో బీజేపీకి 748, కాంగ్రెస్​కు 489, మజ్లిస్ కు 85, బీఆర్ఎస్​కు 65 ఓట్లు వచ్చాయి. 

ప్రతి వెయ్యి ఓట్లను రౌండ్​గా పరిగణించి కౌటింగ్​ చేపట్టగా.. నాలుగు, ఐదు రౌండ్లలో ఒక డివిజన్ రిజల్ట్ ప్రకటించారు. బీజేపీ గెలుచుకున్న డివిజన్లలో ప్రతి రౌండ్​లో ఆ పార్టీ మెజారిటీ సాధించింది. అయితే, అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ మ్యాజిక్​ ఫిగర్​ను మాత్రం అందుకోలేకపోయింది. 

బీజేపీకి అదే సంఖ్య రిపీట్.. ​

2020 ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచిన బీజేపీ మేయర్ పీఠాన్ని స్వల్ప తేడాతో కోల్పోయింది. మొత్తం 60 డివిజన్​లున్న నగరపాలక సంస్థలో ఈసారి క్లియర్ మెజారిటీతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పొందడానికి సెలెక్ట్​ చేసిన 51 డివిజన్లలో అభ్యర్థులను పోటీకి దింపింది. ఎంపీ అర్వింద్ కార్పొరేషన్ ఎలక్షన్​పై ప్రధాన గురిపెట్టి ప్రచారం నిర్వహించారు. అయితే ఈసారి కూడా గత ఎన్నికల్లో మాదిరిగా 28 స్థానాల్లోనే బీజేపీ గెలిచింది. 17 డివిజన్లు గెలుపొందిన కాంగ్రెస్ సెకండ్ స్థానం పొందింది.

21 డివిజన్లలో పోటీ చేసిన మజ్లిస్14 సీట్లు మాత్రమే గెలిచింది. 2020 ఎన్నికల్లో 16 డివిజన్లు గెలిచిన మజ్లిస్​ ఈసారి ఆ సంఖ్యను దాటించాలని శ్రమించగా ఫలితం దక్కలేదు. 58 డివిజన్లలో పోటీ చేసిన బీఆర్ఎస్​ సింగిల్ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, గెలుపు ధీమాతో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా గురువారం సాయంత్రమే ఆ పార్టీ అభ్యర్థులను వెంటబెట్టుకొని క్యాంపులకు వెళ్లారు. కానీ రిజల్ట్ వ్యతిరేకంగా రావడంతో ఇప్పుడు వారంతా వాపస్ వచ్చేశారు.  

ఏం జరుగబోతుంది?

నిజామాబాద్ కార్పొరేషన్​లో మేయర్, డిప్యూటీ మేయ ర్ పదవికి 31 మంది కార్పొరేటర్ల ఓట్లు అవసరం. ఈ మ్యాజిక్​ ఫిగర్​ను ఏ పార్టీ కూడా పొందకపోవడంతో ఏమి జరుగబోతుందనే విషయం ఉత్కంఠ రేపుతోంది. 28 డివిజన్లు గెలిచిన బీజేపీకి ఎంపీ అర్వింద్​తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్​రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపితే 31 ఓట్లు అవుతాయి. అలాగే, బీజేపీకి కరీంనగర్–​-మెదక్–​-నిజామాబాద్– అదిలాబాద్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ నుంచి గెలిచిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి ఉన్నారు. ఒకవేళ వారిద్దరు నిజామాబాద్ కార్పొరేషన్​లో ఎక్స్​అఫీషియో ఓట్లు నమోదు చేసుకుంటే మొత్తం బలం 33 అవుతుంది. 

యాంటీ బీజేపీ సిద్ధాంతంతో మజ్లిస్ తమ 14 మంది కార్పొరేటర్ల బలాన్ని 17 మంది కార్పొరేటర్లున్న కాంగ్రెస్​కిస్తే మెజారిటీ 31 అవుతుంది. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపితే కాంగ్రెస్ బలం కూడా 33కు చేరుతుంది. 2020లో  కేవలం13 మంది కార్పొరేటర్లను గెలిచిన బీఆర్ఎస్,  మజ్లిస్ పార్టీ సపోర్టుతో, 5 ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్ పదవిని దక్కించుకున్నది.