బీజేపీ ఎల్పీ లీడర్ ఎంపిక ఆలస్యం!

బీజేపీ ఎల్పీ లీడర్  ఎంపిక ఆలస్యం!
  • హైకమాండ్ నిర్ణయానికే వదిలేసిన రాష్ట్ర నాయకత్వం
  • రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణా రెడ్డి మధ్య పోటీ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ శాసన సభా పక్ష నేత ఎంపిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గురువారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇక అందరి దృష్టి ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపికపై పడింది. పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదరకపోవడం, ఫ్లోర్ లీడర్ పదవిని ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉండడంతో రాష్ట్ర నాయకత్వం ఈ బాధ్యత నుంచి తప్పుకుంది. ఫ్లోర్ లీడర్ ఎంపిక బాధ్యతను హైకమాండ్ నిర్ణయానికే వదిలేసింది. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని రాజాసింగ్ ఆశిస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఈయనే కావడంతో.. రాజాసింగే పార్టీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్ లో బీజేపీ గెలిచినా ఆయనే ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు. తర్వాత వివాదాస్పద కామెంట్లతో పార్టీ హైకమాండ్ రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది.  ఆ టైమ్​లో రఘునందన్ రావు ఫ్లోర్ లీడర్ పదవి ఆశించినా ఆయనకు దక్కలేదు. ఇప్పుడు ఆయన రెండోసారి గెలిచి.. ఫ్లోర్ లీడర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే తెలుగు భాషపై పట్టు లేకపోవడం, పైగా హిందుత్వం నినాదాన్నే ఎత్తుకోవడంతో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఫ్లోర్ లీడర్ ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇప్పటికే సిటీకి చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి, లక్ష్మణ్ కు బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇప్పుడు సిటీకి చెందిన రాజాసింగ్ కు ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే అన్ని పదవులు సిటీ నేతలకేనా అనే విమర్శ బీజేపీ ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలకు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. 

ఉమ్మడి ఆదిలాబాద్​ నుంచి నలుగురు.. 

నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ నుంచి ఏకంగా నలుగురు గెలిచారు. పార్టీ మొత్తం 8 సీట్లను గెలుచుకోగా అందులో సగం  సీట్లు ఈ జిల్లా నుంచే ఉండడంతో తమకే ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వాలని అడుగుతున్నారు. కామారెడ్డి నుంచి గెలిచిన కాటెపల్లి వెంకట రమణా రెడ్డి కూడా ఎల్పీ పదవిని ఆశిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయినా ఇటు కేసీఆర్, అటు రేవంత్ ను ఓడించి రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఎల్పీ లీడర్ పదవి రేసులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణా రెడ్డి ముగ్గురు ఉండడంతో.. మరి హైకమాండ్ ఎవరికి ఈ పదవి కట్టబెడుతుందనేది ఆసక్తిగా మారింది.