తెలంగాణలో బీ ట్యాక్స్

తెలంగాణలో బీ ట్యాక్స్
  •     కాంట్రాక్టర్ల నుంచి ఓ మంత్రి 9% వసూలు చేస్తున్నడు: ఏలేటి
  •     బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో రూ.2 లక్షల కోట్ల కుంభకోణం
  •     20 లక్షల ఎకరాలు కబ్జా 
  •     బీఆర్ఎస్​ను కాంగ్రెస్ కాపాడుతున్నదని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆర్ ట్యాక్స్ తరహాలో కొత్తగా బీ ట్యాక్స్ వచ్చిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఓ మంత్రి బీ ట్యాక్స్ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి 9% కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని రోజులు ఉంటమో తెలియదన్నట్టుగా మంత్రులు దోచుకుంటున్నారని అన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఏలేటి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి రూ.2 లక్షల కోట్ల కుంభకోణం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు కబ్జా చేశారని చెప్పారు. ‘‘తెలంగాణ ఏర్పడినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉండేవి. 

ఇప్పుడు కేవలం 6 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దాదాపు 3.5 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచినట్టు రికార్డులు ఉన్నాయి. 1.30 లక్షల ఎకరాల భూదాన్ భూములు, లక్ష ఎకరాల ఎండోమెంట్ భూముల్లో కనీసం 40 శాతం భూములు రికార్డుల్లో కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ లోని 1,100 ఎకరాల ఎండోమెంట్ భూములను తక్కువ ధరకే పరిశ్రమలకు ఇచ్చారు” అని తెలిపారు. రాష్ట్రంలోని అసైన్డ్, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, ప్రైవేట్ భూములను సమగ్ర సర్వే చేసి డిజిటలైజేషన్ చేయాలని కేంద్రం రూ.83 కోట్లు ఇస్తే.. ఇప్పటి వరకు సర్వే ప్రారంభించలేదని మండిపడ్డారు. 

ధరణి అక్రమాలపై విచారణ ఏమైంది? 

అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లో ధరణి అక్రమాలపై విచారణ జరిపిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. మూడు నెలలైనా ఎందుకు విచారణ జరిపించడం లేదని ఏలేటి ప్రశ్నించారు. ‘‘గతంలో కోకాపేట భూముల విషయంలో ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ధర్నాలు చేసి సీబీఐకి లెటర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం లేదు. మియాపూర్ భూముల్లో కేకే హస్తం ఉందని 2017లో రేవంత్ రెడ్డి అన్నారు. 

ఎంపీ రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మీద అనేక ఆరోపణలు ఉన్నా యి. కాంగ్రెస్​లో చేరగానే వాళ్లు కడిగిన ముత్యమయ్యారా?” అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్, కేటీఆర్​ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రూ.2 లక్షల కోట్లలో కాంగ్రెస్ నాయకులు 40 శాతం వాటా అడుగుతున్నారని మాకు సమాచారం ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూపిస్తున్న ఉత్సాహం.. ధరణి పోర్టల్ వ్యవహారంలో ఎందుకు చూపించడం లేదు” అని ప్రశ్నించారు.