ఇయ్యాల ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ మీటింగ్

ఇయ్యాల ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ మీటింగ్
  • హాజరుకానున్న కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్
  • గెలుపే లక్ష్యంగా కార్యాచరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేస్తున్నది. రాష్ట్రంలోని 19  ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలనే విషయాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఆశావహుల  జాబితా తయారీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సమావేశం జరగనుంది. 

పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్​కు.. చీఫ్ గెస్టులుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. వీరితో పాటు బీజేపీ ఎస్సీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి, ఎస్టీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావుతో పాటు కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు  రానున్నారు. ఒక్కో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బూత్ కమిటీల నియామకం, అక్కడ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పాత, కొత్త నాయకులు ఎవరున్నారు? వంటి అంశాలపై మీటింగ్​లో చర్చించనున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి,  ఈ 4 నెలల పాటు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ఏయే ప్రోగ్రామ్​లు చేపట్టాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు.