బీజేపీకి ‘దక్షిణ’ ముఖద్వారంగా తెలంగాణ

బీజేపీకి  ‘దక్షిణ’ ముఖద్వారంగా తెలంగాణ

హైదరాబాద్, వెలుగు: ‘మిషన్ దక్షిణ్’ను స్పీడప్ చేయాలని.. దక్షిణాన జెండా ఎగరేసేందుకు తెలంగాణ ముఖద్వారం కావాలని పార్టీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్​లో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని రాష్ట్రాల ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేషనల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఉత్తారాదిన సత్తా చాటిన బీజేపీ, ఇప్పడు దక్షిణాన బలోపేతమవడంపై ఫోకస్ పెట్టిందని నడ్డా అన్నారు. ఇక్కడ జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ రాజకీయాలపై బలమైన ప్రభావం చూపుతాయని నడ్డా తన ప్రసంగంలో చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ పక్కాగా గెలుస్తుందనే వాతావరణాన్ని ఇప్పటి నుంచే కల్పించాలని, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రూట్ మ్యాప్ ను  సిద్ధం చేయాలని కోరారు. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారం అందుకోవాలని సూచించారు. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, ఏపీలోను పార్టీ బలోపేతంపై ముమ్మర కసరత్తు చేయాలని కోరారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు.

25 ఏండ్లకు రూట్ ​మ్యాప్

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రతి కార్యకర్త, నాయకుడు ఏడు పాయింట్ల ఫార్ములాను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని నడ్డా పిలుపునిచ్చారు. సేవాభావం, సమానత్వం, ఓర్పు, సమన్వయం, పాజిటివిటీ, సీరియస్ నెస్, కమ్యూనికేషన్.. వీటిని ఫాలో అవుతూ పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ వంటి ఎంతో చరిత్ర కలిగిన పార్టీలు జాతీయ స్థాయిలో నేడు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో.. ఒకసారి గుర్తు చేసుకొని, అలాంటి పరిస్థితులను బీజేపీ అధిగమించేలా పని చేయాలని హితబోధ చేశారు. మాతృభూమి కోసం మనం పని చేస్తున్నామనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్‌ లో పార్టీ కోసం తెగించి కోట్లాడుతున్న కార్యకర్తలను చూసి మనం గర్వపడాలన్నారు. మన ఆలోచన విధానం నేషన్ ఫస్ట్ అనేలా ఉండాలన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో మొత్తం 22 అంశాలపై జరిగిన చర్చలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించి, వారికి బీజేపీ గురించి వివరించాలని కోరారు. రాబోయే 25 ఏండ్లకు సంబంధించిన రూట్ మ్యాప్ ను తయారు చేసుకోవాలన్నారు. మొదటిసారి ఓటు వేసే వారిని పార్టీ వైపు తిప్పుకోవాలని, యువతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వారిని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని అన్ని రాష్ట్రాల​ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీలకు నడ్డా పిలుపునిచ్చారు.

సభ సక్సెస్ పై సంతోషం 

హెచ్ఐసీసీలో ఉన్న నడ్డాను సోమవారం లక్ష్మణ్, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత వీరు అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడానికే బీజేపీ ఈ సమావేశాలు, సభ నిర్వహించిందని లక్ష్మణ్ అన్నారు. బోనాల పండుగకు వచ్చినంత జనం రాలేదని బీజేపీ సభపై టీఆర్ఎస్ చేసిన విమర్శలపై మండిపడ్డారు. బోనాల పండుగకు వచ్చిన జనం సంగతి పోతురాజులకు ఏం తెలుసు.. గుడిలో ఉన్న అమ్మవారికి తెలుసన్నా రు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించిన జాతీయ నేతలు, పరిస్థితి పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారని చెప్పారు. పార్టీ మీటింగ్ ను బోనాలతో పోల్చడం దుర్మార్గమని ఈటల రాజేందర్ మండిపడ్డారు. మరోసారి తెలంగాణలో బీజేపీ సునామీ మొదలైందని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సభను విజయవంతం చేసిన అన్ని జిల్లాల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డీకే అరుణ కృతజ్ఞతలు చెప్పారు.