ఉప్పల్ సెగ్మెంట్​లో గెలుపు నాదే: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్ సెగ్మెంట్​లో గెలుపు నాదే: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు: తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప్పల్ సెగ్మెంట్​లో చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తోందని బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్​లో తనకు పోటీనిచ్చే నాయకులు లేరన్నారు. తనను గెలిపిస్తే  ఈ సెగ్మెంట్​లో జనాలకు సమస్యగా తలెత్తిన తై బజార్​ను రద్దు చేసి చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం విజయపురి కాలనీలో శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని.. జనం సమస్యలు తనకు తెలుసన్నారు.

 బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవినీతి రహిత పాలన అందించినట్లు ఆయన తెలిపారు. సూర్యానగర్ వెల్పేర్ అసోసియేషన్​లో సీనియర్ సిటిజన్లతో శామీర్ పేట ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.  అభివృద్ధి ప్రధాతలెవరో, ప్రగతి నిరోధకులు ఎవరో ప్రజలు గుర్తించాలని కోరారు. అనంతరం ఉప్పల్​లోని కూరగాయల మార్కెట్​లో ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు.