కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు దిగజారాయి:ఈటల రాజేందర్

 కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు దిగజారాయి:ఈటల రాజేందర్

దేశంలో ఖరీదైన ఎన్నికలు ఎక్కడ జరుగుతాయంటే తెలంగాణలో జరుగుతాయన్న పరిస్ధితి కేసీఆర్ తీసుకొచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో  ఎప్పుడూ లేని రాజకీయ పరిస్ధితులు ఏర్పడ్డాయని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సొంత ఆలోచనలు ఉండొద్దని..బానిసలుగా మార్చుకునే ప్రయత్నం చేశారన్నారు. గతంలో అటుకులు బుక్కి...ఉపాసం ఉండి ఎన్నికల్లో గెలిచామని చెప్పే కేసీఆర్..ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచి ఏడాది పూర్తయి సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. 

తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిన రోజు...
2021 ఏప్రిల్ 31న తనను అక్రమంగా టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆరు నెలల తర్వాత హోరా హోరీ ఎన్నికల్లో 2021 నవంబర్ 2న హుజురాబాద్ ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. 2021 నవంబర్ 2 తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిన రోజని చెప్పారు. హుజురాబాద్ ప్రజలు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రోజు అని వెల్లడించారు. హుజురాబాద్ ఎన్నికల్లో తాను గెలిచాక..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు దీపావళి పండగ చేసుకున్నారని చెప్పారు. 

న్యాయం గెలిచింది..
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధర్మం, దౌర్జన్యం, దుర్మార్గం మీద న్యాయం, ధర్మం గెలిచిందని ఈటల రాజేందర్ అన్నారు. డబ్బులు సంచులు, అధికారం, మద్యం ప్రజల విశ్వాసం ముందు చెల్లవని హుజురాబాద్ ప్రజలు తేల్చి చెప్పారన్నారు. అహంకారం, దౌర్జన్యం, దుర్మార్గాన్ని బొంద పెట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటదని చాటి చెప్పారని వివరించారు.