టీఆర్‌ఎస్‌ ఎలిసిపోయిన పార్టీ

టీఆర్‌ఎస్‌ ఎలిసిపోయిన పార్టీ
  •     సర్కారు ఎప్పుడు కూలిపోతదా అని జనం ఎదురు చూస్తున్నరు
  •     ఏ ఎలక్షన్లనైనా హుజూరాబాద్ రిజల్టే రిపీటైతది

మెదక్, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని యావత్ తెలంగాణ ప్రజలు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారని హుజూరాబాద్​ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారంలో నిర్వహించిన బీజేపీ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్​ప్రభుత్వం చెప్తున్నదానికి, చేస్తున్నదానికి పొంతన లేకుండా పోయిందన్నారు. ‘‘అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ ఫెయిలయ్యారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్​వెలిసిపోయింది. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు భావిస్తున్నరు. ఆయన అహంకారానికి, నియంతృత్వ పోకడలకు వాళ్లే చరమగీతం పాడుడు ఖాయం. 365 రోజుల్లో 142 రోజులు ఫామ్ హౌసుల్నే కూసొని పాలించిన ఏకైక సీఎం కేసీఆర్. అయితే హుజూరాబాద్ దెబ్బకు ఫామ్ హౌస్ వదిలిండు. ధర్నాచౌకుకు వచ్చి పడ్డడు. హుజూరాబాద్ లెక్కనే తెలంగాణ ప్రజలు కూడా ఆత్మగౌరవం నిలబెట్టుకుంటానికి ఎదురు చూస్తున్నరు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హుజూరాబాద్ రిజల్టే వస్తది’’ అని అన్నారు.

తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడం అందరి ముందున్న లక్ష్యమని బీజేపీ శ్రేణులకు సూచించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా పాలన అందిస్తున్నరు. రైతు చట్టాలను వెనక్కు తీసుకుని గొప్ప వ్యక్తిగా నిలిచిన్రు” అని కొనియాడారు. తన పౌల్ట్రీ ఫామ్ మెదక్ జిల్లాలోనే ఉందని, అందులో ఒక్క ఎకరం కబ్జా ఉన్నా ముక్కు నేలకు రాస్తానని ఆల్రెడీ చెప్పానని గుర్తు చేశారు. తన భూముల విషయంలో కలెక్టర్ తోనే అబద్ధాలు చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘కేసీఆర్ కు దగ్గరుంటే మంచోళ్లు, లేకుంటే చెడ్డోళ్లా? ధాన్యం సేకరణలో ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్. ముందస్తు ప్రణాళిక లేక బొక్కబోర్లా పడ్డరు. 10 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న మిల్లులు, 10 క్లస్టర్లు పెడితే కోటి టన్నుల బియ్యం పట్టొచ్చు. కానీ అట్ల చేస్తలేరు. జస్ట్ 500 కోట్ల రూపాయలతో రైతులను పూర్తిగా ఆదుకోవచ్చు. అయినా అది చేయకుండా కేసీఆర్​అనవసర రాద్ధాంతం చేస్తున్నడు” అని ఈటల  ధ్వజమెత్తారు.