రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణం  కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు.  ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ 24 గంటలు అందుబాటులో ఉంటేనే  గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. 

కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించకపోవడంపై పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.  క్రమశిక్షణ పాటించని నాయకులను, కార్యకర్తలను ఉపేక్షించరాదన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రజల సేవలో చురుకుగా పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలన్నారు.  ఏఎంసీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, యరగాని నాగన్న గౌడ్, సాముల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.