నా ఫ్యామిలీకి ఏమైనా కేసీఆర్ దే బాధ్యత

నా ఫ్యామిలీకి  ఏమైనా కేసీఆర్ దే బాధ్యత

కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్కు ఎలా భయపడతానని అన్నారు. తనకు తన కుటుంబసభ్యులకు ఏమైనా కేసీఆర్ దే బాధ్యత అని చెప్పారు. తప్పు చేసినవాళ్లు దొరలెక్క ఉంటున్నారని.. ప్రజల కోసం పనిచేసేవాళ్లకు శిక్షలు వేస్తున్నారని ఆరోపించారు. 

శాసనసభలో బీజేపీ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఈటల ఆరోపించారు. స్పీకర్ ను మరమనిషి అన్నందుకు తనకు శిక్ష వేశారని.. మరి కేసీఆర్ అన్న మాటలకు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని.. ఒక సభ్యుడు ఉన్నా బీఏసీలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేవారని తెలిపారు. బీఏసీ అంశం గురించి రఘునందన్ రావు అడిగినా.. స్పీకర్ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కేసీఆర్ ను ఓడగొట్టేవరకు నిద్రపోను అని వ్యాఖ్యానించారు. 

గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఎప్పుడు జరగలేదని ఈటల అన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చించలేదని మండిపడ్డారు. ప్రజలు హూజూరాబాద్ లో కేసీఆర్ ను తిరస్కరించి.. సభలోకి నన్ను పంపారని చెప్పారు. అటువంటిది తనను సభ నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు.