శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే ఫైరింగ్.. స్టేషన్‌లోనే కాల్పులు​

శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే ఫైరింగ్.. స్టేషన్‌లోనే కాల్పులు​
  • ల్యాండ్ సెటిల్​మెంట్​లో ఘర్షణ.. పోలీస్ స్టేషన్​లోనే కాల్పులు
  • ఎమ్మెల్యే గణ్​పత్​ అరెస్టు.. హత్యాయత్నం కేసు నమోదు

థానే, ముంబై: మహారాష్ట్రలో శివసేన షిండే వర్గానికి చెందిన నేతలపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి సీరియస్​గా ఉంది. ల్యాండ్​సెటిల్​మెంట్ ​విషయంలో శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్​లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఫైరింగ్​కు దారితీసింది. అధికార కూటమి పార్టీల నేతల మధ్య ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. 

భూ వివాదంపై మాట్లాడేందుకు శివసేన షిండే వర్గం కళ్యాణ్​ జిల్లా అధ్యక్షుడు మహేశ్​ గైక్వాడ్, మరో నేత రాహుల్​ పాటిల్ తమ అనుచరులతో కలిసి శుక్రవారం రాత్రి ఉల్హాస్​నగర్​లోని హిల్​లైన్ పోలీస్ ​స్టేషన్​కు వెళ్లారు. సీఎం షిండే కొడుకు, కళ్యాణ్ ఎంపీ శ్రీకాంత్ షిండేకు వీరు సన్నిహితులు. వీరు పోలీస్​స్టేషన్​లో ఉన్న టైమ్​లోనే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​కు సన్నిహితుడైన బీజేపీ కళ్యాణ్​ఈస్ట్ ఎమ్మెల్యే గణ్​పత్ గైక్వాడ్ తన కొడుకు, అనుచరులతో కలిసి అక్కడి చేరుకున్నారు. అక్కడ సీఐ ఆఫీసులో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణ్​పత్ తన తుపాకీతో మహేశ్​ గైక్వాడ్​, రాహుల్ ​పాటిల్​పై ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా మహేశ్ ​గైక్వాడ్  శరీరం నుంచి ఆరు బుల్లెట్లు, రాహుల్ పాటిల్ శరీరం నుంచి రెండు బుల్లెట్లు తొలగించినట్లు డాక్టర్లు చెప్పారు. మహేశ్​ పరిస్థితి చాలా సీరియస్​గా ఉందని.. రాహుల్ కూడా ఐసీయూలోనే ఉన్నాడని తెలిపారు. కాగా, ఎమ్మెల్యే గణ్​పత్ ను అరెస్టు చేశామని.. అతనిపై ఐపీసీ 307, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్​ దత్తాత్రేయ షిండే శనివారం తెలిపారు. అరెస్టుకు ముందు గణ్​పత్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ ​స్టేషన్​లో తన కొడుకుపై శివసేన నేతలు, వారి అనుచరులు దాడి చేస్తుంటే ఆత్మరక్షణ కోసమే ఫైరింగ్ చేశానని చెప్పారు. వారిపై కాల్పులు జరిపినందుకు తాను ఏమాత్రం విచారం, పశ్చాతాపం చెందడం లేదని అన్నారు.