- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కోసం ఎంత ఖర్చయినా రక్షణశాఖ నుంచే నిధులు ఇస్తామని ఇటీవల రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని, దీంతోపాటు అక్కడ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ తెలిపారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లు కాలయాపన చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని ఆరోపించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఆదిలాబాద్‌లో తగినంత స్థలం అందుబాటులో ఉందని, అక్కడ ఫ్లైట్ పార్కింగ్, చార్టర్డ్ ఫ్లైట్లకు తక్కువ ధరకే వసతి కల్పించవచ్చని సూచించారు.
