బీసీలకు లక్ష సాయం లిస్టులు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎందుకియ్యట్లే? : రఘునందన్ రావు

బీసీలకు లక్ష సాయం లిస్టులు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎందుకియ్యట్లే? : రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయం స్కీమ్ అమలులో బీఆర్ఎస్ సర్కార్ నిబంధనలకు తూట్లు పొడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. సర్పంచుల నుంచి మొదలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల వరకు ఏ ఒక్కరికీ బీసీ లక్ష సాయం జాబితాను ఇవ్వడంలేదన్నారు. అధికార పార్టీ నాయకులకు నచ్చినోళ్లకే బీసీ బంధు ఇస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎమ్మెల్యేలకు రూ. 5 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తుండగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాత్రం ఎగ్గొడుతోందన్నారు. ‘‘సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవరు, గౌరవించరు. 

బీసీ బంధులో పేరు నమోదు కోసం అర్హులైనవారిని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మొదలు ఉన్నతాధికారుల వరకు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీసీల్లోని 93 కులాకుగాను కేవలం 14 కులాలకే సాయం చేస్తూ, మిగతా కులాలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. స్కీం అమలులో గైడ్ లైన్స్ ఏమాత్రం అమలుకావడం లేదన్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా ఇస్తున్నారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు బీసీలకు లక్ష సాయం జాబితాలను ఇవ్వని కలెక్టర్ పై చీఫ్ సెక్రటరీకి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 

ప్రభుత్వ పథకాల అమలులో బీజేపీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలను విస్మరిస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. ‘‘బీసీ బంధు పథకం కోసం సిద్దిపేట జిల్లా నుంచి ఆన్ లైన్ ద్వారా 26 వేల అప్లికేషన్స్ వచ్చాయి. 55 శాతం ఉన్న బీసీల్లో కేవలం 3 నుంచి 4 శాతం బీసీలకు మాత్రమే అవకాశం కల్పించడం దుర్మార్గం. రాష్ట్రంలో 93 బీసీ కులాల వారందరికీ స్కీం అమలు చేయాలి” ఆయన డిమాండ్ చేశారు.